VV LaxmiNarayana: ప్రత్యేక హోదాపై బ్యాన్ లేదు, ఏపీ ప్రజల్ని వైసీపీ మోసం చేసింది: లక్ష్మీనారాయణ
EX CBI Joint Director VV LaxmiNarayana: విశాఖపట్నం నుంచి తాను పోటీ చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
LaxmiNarayana to contest from Visakhapatnam: శ్రీకాకుళం: విశాఖపట్నం నుంచి తాను పోటీ చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అయితే ఎంపీగానా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ శ్రీకాకుళంలో జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. అప్పు అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విధ్వవసం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ ధ్యేయం అన్నారు. గత పాలకులు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని.. హోదా తెస్తామని మోసం చేశారని విమర్శించారు. 25 ఏంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాం అని చెప్పిన జగన్.. మెజార్టీ ఎంపీలు గెలిచాక కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉందని మాట మార్చారని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
వైసీపీ తమ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. సీఏఏ బిల్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నిక, ఢిల్లీ బిల్లు సమయంలో వైసీపీ ఎంపీలు ప్రతిఘటించి ఉంటే హోదా వచ్చేదన్నారు. అప్పుడు ఏం చేయని వాళ్లు.. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామంటూ వైసీపీ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. పలు చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్ గా ఏర్పడి ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ప్రత్యేక హోదాపై బ్యాన్ లేదు..
రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ఈ విషయాన్ని 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే.సింగ్ చెప్పారని లక్ష్మీనారాయణ గుర్తుచేవారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే తమ ప్రధాన ఎజెండా అన్నారు. విద్యార్థుల మార్చి 1న ఛలో తాడేపల్లి ప్యాలెస్ కు మద్దతు ప్రకటించారు. ఉద్యమాలను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర స్థాయిలో చేపట్టాలని.. అందుకు రైతు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. నేడు (ఫిబ్రవరి 28న) తాడేపల్లిలో జరిగే సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు.