Employes Agitation: సీపీఎస్ రద్దు కోరుతూ ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు, రేపు చలో విజయవాడకు పిలుపు
Employes Agitation: మలి విడత ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులు, సీపీఎస్ రద్దు కోరుతూ రేపు చలో వియవాడకు పిలుపు; ఎక్కడికక్కడ క్రిమినల్ నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు
Employes Agitation: జగన్(Jagan) ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా...గతంలో ఆందోళన చేపట్టిన సమయంలో మంత్రివర్గ సభ్యులు ఇచ్చిన హామీలు సైతం అమలు చేయకపోవడంతో వారు రేపు చలో విజయవాడ(Vijayawada)కు పిలుపునిచ్చారు.అయితే ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసు( AP Police)లు ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొంటే క్రిమినల్ చర్యలు ఉంటాయని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి చలో విజయవాడ కార్యక్రమంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఓపీఎస్ కోసం పట్టు
సీపీఎస్(CPS) రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగుల సహకారంతో గద్దెనెక్కిన జగన్ ఆ తర్వాత మాటమార్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు గతంలోనే పెద్దఎత్తున ఉద్యమించారు. సమ్మెకు సైతం సిద్ధం కావడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచి తాత్కాలిక హామీలతో ఉద్యోగులను శాంతపరిచింది.కానీ రెండోసారి ఇచ్చిన హామీలను సైతం ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో....మరోసారి ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సీపీఎస్ కు బదులుగా జీపీఎస్(GPS) తీసుకురావడాన్ని నిరసిస్తూ...సీపీఎస్ ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. పాత పెన్షన్ సాధన కోసం ఈనెల 18 తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఓట్ ఫర్ ఓపీఎస్(OPS) నినాదాన్ని మోతమోగిస్తున్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్బంధం
ఉద్యోగులను నిలువరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగులు విజయవాడకు తరలిరాకుండా సీపీఎస్ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు(Police) క్రిమినల్ నోటీసులు జారీచేశారు. సీపీఎస్ ఉద్యోగుల ఇళ్లకు, వారు పనిచేసే ప్రదేశాలకూ వెళ్లి నేరుగా నోటీసులు అందజేస్తున్నారు. చలో విజయవాడకు పోలీసు శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అనుమతులు లేవని, నోటీసులను కాదని విజయవాడ వెళ్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేవలం 500 మందితోనే కార్యక్రమం నిర్వహించుకోవాలంటూ విజయవాడ(Vijayawada) పోలీసులు అనుమతి ఇవ్వడం విశేషం.ఒకవైపు నిరసన కార్యక్రమానికి అనుమతులు ఇస్తూనే....మరోవైపు ఉద్యోగులకు నోటీసులివ్వడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన హామీను అమలు చేయమంటే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సైతం ఇవ్వడం లేదని..జీతాలు సైతం సక్రమంగా చెల్లించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు భయడేది లేదని వారు తేల్చి చెప్పారు,.
ఏపీ జేఏసీ హెచ్చరిక
ఏపీఎన్జీవో(APNGO)లు సైతం ఆందోళనకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 26 వరకు సమయమిస్తున్నామని...అప్పటికీ ఏ విషయం తేల్చకుంటే తాము కూడా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో నిర్వహించిన దాని కన్నా మిన్నగా ఈసారి ఉద్యోగులు తరలివస్తారని తేల్చి చెప్పారు. ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం పేరిట ఇప్పటికే ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించి బకాయిలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి సంఘం డిమాండ్ చేసింది. లేకుండా ఈనెల 22న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.