Godavari Floods : ఆరు జిల్లాల్లో 628 గ్రామాలపై వరద ప్రభావం, ధవళేశ్వరం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద!
Godavari Floods : ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Godavari Floods : రాజమహేంద్రవరం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీకి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 21.32 లక్షల క్యూసెక్కులు ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర వరద ఉద్ధృతిని పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచిస్తోంది.
62,337 మంది పునరావాస శిబిరాలకు తరలింపు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 21 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. అధికారులకు ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు ఇస్తుంది. వరద ఉద్ధృతం దృష్ట్యా అదనపు సహాయక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితం చెందాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 177 గ్రామాల్లో వరద ప్రవాహం ఉండనుంది. ఇప్పటి వరకూ 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోందని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరో 24 గంటలు కీలకం
లంక గ్రామాలు, కరకట్టలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించాలని, మరణాలు సంభవించకుండా అధికారులు, సిబ్బంది, మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అంతే కాదు 5గురు ప్రత్యేక అధికారులను కూడా వరదల సమీక్షకు ఏర్పాటు చేశామన్నారు. మరో 24 గంటలు చాలా కీలకమని, అలర్ట్ గా ఉండాలని సీఎం అన్నారు.