AP BJP Leaders : పీఎం ఆవాస్ యోజన ఇళ్లకు వైసీపీ రంగులు వద్దు, కేంద్రమంత్రికి బీజేపీ నేతల ఫిర్యాదు
AP BJP Leaders : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
AP BJP Leaders : దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.. ఆదివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న పొరపాట్లు, అలసత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కేంద్రమంత్రికి వినతిపత్రం అందించారు. త్వరలో ఏపీలో పర్యటించాలని కోరగా హర్దీప్ సింగ్ పూరి వస్తానని హామీ ఇచ్చారు.
20 లక్షల ఇళ్లు మంజూరు
వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 10 లక్షల ఇళ్ల కేటాయించారని సోము వీర్రాజు తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల ఇళ్లను కేటాయించారన్నారు. కేంద్రం కేటాయించిన ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, ఇళ్లు నిర్మాణ స్థితికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి తన రాయితీని మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 30 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం మరో 20 లక్షలు ఇళ్లను ప్రధాన మంత్రి ఆవాస్ యోజక కింద మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ 20 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 30 వేల ఇళ్లు లబ్దిదారులకు అందజేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శమని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఒకసారి ఏపీలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరారు. పేదలకు లబ్దిచేకూరాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్రమంగా అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వైసీపీ రంగులు వద్దు
"దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా ఏపీకి ఎక్కువగా ఇళ్లు కేటాయిస్తే రాష్ట్రంలో ఎందుకు నత్తనడకన నడుస్తుంది?. ఈ విషయంపై కేంద్రమంత్రి వెంటనే సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశాము. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి వ్యక్తిగతంగా పరిశీలన చేయాలని కోరాము. కేంద్ర సహకారంతో నిర్మాణం జరుగుతున్న ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే బోర్డు లేదు. వైసీపీ రంగులు వేస్తున్నారు, వైసీపీ ఇళ్లుగా మార్చడం సిగ్గుచేటు. కేంద్రం గైడ్లైన్స్ లో లేని విషయాలను అమలు చేస్తున్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలపై ప్రస్తుత పరిస్థితి ఎంటి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరాం. జగనన్న కాలనీ మోదీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలని కోరాము. వైసీపీ కలర్ వాడొద్దు ఫిర్యాదు చేశాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లు సైతం ఇప్పటికీ ప్రజలకు ఇవ్వలేదు. వాస్తవాలు తెలుసుకోవాలని పేదలకు న్యాయం చేయాలని కోరాము." - విష్ణువర్ధన్ రెడ్డి