Ambati Rayudu: 'క్రికెట్ అలా.. పాలిటిక్స్ ఇలా' - గుంటూరు 'మిర్చి' అంబటి రాయుడు వ్యవహార శైలి వివాదమేనా!
Ambati Rayudu: స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడం సంచలనం కలిగించింది. ఇటీవలే ఆయన పార్టీలో చేరగా ఇప్పుడు ఇలా ప్రకటించడంపై అందరిలోనూ ఏం జరిగిందో అనే ఉత్కంఠ నెలకొంది.
Ambati Rayudu Resigned to Ysrcp: వైసీపీకి (Ysrcp) బిగ్ షాక్ తగిలింది. డిసెంబర్ 28న ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన, అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడం సంచలనం కలిగించింది. ఏం జరిగిందో అనే ఊహాగానాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. 'వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేయడంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
అప్పుడు అలా
రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించానని వైసీపీలో చేరిక సందర్భంగా అంబటి రాయుడు తెలిపారు. సీఎం జగన్ పై మొదటి నుంచీ మంచి అభిప్రాయం ఉందని, ఆయన కుల మతాలకు అతీతంగా, రాజకీయాలతో పని లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలందరికీ సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని, అందుకే ఆయన పక్షాన నిలబడినట్లు అప్పుడు వివరించారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని వెల్లడించారు. జగన్ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటించిన అంబటి రాయుడు విద్యార్థులు, యువతతో మమేకమైన అంబటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం జగన్ విధానాలకు సపోర్ట్ గా ట్వీట్లు చేశారు. 10 రోజుల క్రితం ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. ఇంతలోనే ఏం జరిగిందో తాను వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరి దీనిపై సీఎం జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆది నుంచీ అంతే
అంబటి రాయుడు ఓ స్టార్ క్రికెటర్ గా అందరికీ సుపరిచితమే. తాజాగా రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన వ్యవహార శైలి ఆది నుంచి దూకుడుగానే ఉంది. చిన్న వయసులో క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన అంబటి రాయుడు స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. లోకల్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకూ ఆయన చుట్టూ అన్నీ వివాదాలే. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు, ఆ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. తన ఆటతీరుతోనే కాకుండా మైదానం వెలుపల దూకుడైన ప్రవర్తనతో పాపులర్ అయిన తెలుగు క్రికెటర్ ఈ గుంటూరు 'మిర్చి' కుర్రాడు ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిన తర్వాత ఆయన జగన్ ను కలిశారు. క్రికెట్ లో కెరీర్ అలా ముగియడంతో రాజకీయాల్లో ఏమాత్రం రాణిస్తారో అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెలిబుచ్చారు. ఇప్పుడే అదే అనుమానం నిజమయ్యేలా ఆయన వ్యవహారశైలి మారింది.
అంబటి క్రికెట్ కెరీర్ ఇలా
ఏపీలోని గుంటూరు జిల్లాలో 1985 సెప్టెంబర్ 23న జన్మించిన రాయుడు.. 16 ఏళ్ల వయసులో తొలిసారి 2001లో HCA తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగు పెట్టారు. అంతకు ముందు ఏడాది క్రికెట్ ఏసీసీ అండర్ -15 ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. పాక్ పై ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఒకే మ్యాచ్ లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో 'భారత్ - ఏ' జట్టులోకి ఆహ్వానం అందింది. శిఖర్ ధావన్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పలతో కలిసి అండర్ - 19 ఆడారు. 2001 నుంచి 2005 వరకూ హైదరాబాద్ కు ఆడిన రాయడు తర్వాత ఆంధ్రాకు మారిపోయారు. హైదరాబాద్ కోచ్ రాజేశ్ యాదవ్ తో విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కోచ్ మారగా, మళ్లీ హైదరాబాద్ జట్టులోకి వచ్చారు. ఆ తర్వాత బీసీసీఐ అనుమతించని ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) ఆడి నిషేధానికి గురయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభం కాగా, 79 ఆటగాళ్లకు క్షమాభిక్షతో మళ్లీ దేశవాళీ క్రికెట్ లో ఆడారు.
ఇవీ వివాదాలు
2019లో అంబటి రాయుడు చోటు దక్కకపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానంలో జట్టులోకి తీసుకున్న విజయశంకర్ ను ఉద్దేశించి 'త్రీడీ ప్లేయర్' అంటూ ట్వీట్ చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు ముగింపు కార్డు పడింది. ఆ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించిన యూటర్న్ తీసుకున్నారు. అలాగే, మరికొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్న రాయుడు రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. వైసీపీలో చేరిన 10 రోజులకే వెనుకడుగు వేయడంతో ఆయన పద్ధతి ఇంతే అంటూ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: Ambati Rayudu : వైసీపీకీ అంబటిరాయుడు రాజీనామా - పార్టీలో చేరిన 10 రోజులకే వైదొలగుతున్నట్టు ప్రకటన