![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
New Medical Colleges In AP: 15న సీఎం జగన్ చేతుల మీదుగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం
New Medical Colleges In AP: ఆంధ్రప్రదేశ్ నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలను సీఎం జగన్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు.
![New Medical Colleges In AP: 15న సీఎం జగన్ చేతుల మీదుగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం CM YS Jagan Mohan Reddy Likely To Inaugurate Medical Colleges On Sept 15 New Medical Colleges In AP: 15న సీఎం జగన్ చేతుల మీదుగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/13/c7cb9aa4849fb1726293bb40d756434c1694619801945798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Medical Colleges In AP: ఆంధ్రప్రదేశ్ నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలను సీఎం జగన్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. విజయనగరం వైద్య కళాశాలను ప్రత్యక్షంగా ప్రారంభిస్తుండగా, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను వర్చ్యువల్‌గా ప్రారంభిస్తారు. వీటిలో మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను ఎంఈఐఎల్ నిర్మించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 17 నూతన వైద్య కళాశాలల స్దాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
వీటిలో ఐదు కళాశాలలు భారత వైద్య విద్యా మండలి (ఎంసీఐ) అనుమతి పొంది నీట్ పరీక్ష ద్వారా అర్హత సాధించిన వారిని వైద్య కోర్సులో చేర్చుకుని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాయి. ఒక్కో కళాశాలలో 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు చేరారు. గత శతాబ్ది కాలంలో రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు అయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఎంఈఐఎల్ త్వరితగతిన పూర్తి చేసింది.
పిడుగురాళ్ల, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, అనంతపురం, పెనుగొండ, తిరుపతి, అమలాపురం, పాలకొల్లులో వైద్య కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన మూడు కళాశాలల్లో విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఆడిటోరియంలు, వైద్య విద్యార్థిని విద్యార్థులు , అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి వసతి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించారు. రాజమండ్రి మెడికల్ కాలేజీని 3.37 ఎకరాలలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో వైద్య కళాశాల, విద్యార్థులు, సిబ్బందికి వసతి, నర్సింగ్ కళాశాల, ప్రధాన బ్లాకులతో పాటు, ప్రయోగశాలలు, లైబ్రరీ గది, లెక్చర్ హాల్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ రూమ్, వంటగది, క్యాంటీన్ ఉన్నాయి.
సముద్ర తీరానికి దగ్గరగా మచిలీపట్నం మెడికల్ కాలేజ్
బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజీ 64.38 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. సముద్ర తీర ప్రాంతంలో ఉండడంతో ఈ కళాశాల నిర్మాణ ప్రాంత నేల స్వభావాన్ని దృష్ట్యా నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా బలమైన పునాదుల కోసం జియోటెక్స్‌టైల్, జియో-గ్రిడ్, గ్రాన్యులర్ సబ్-బేస్ (GSB) వంటి వినూత్న పద్ధతులను ఎంఈఐఎల్ ఉపయోగించింది. నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడానికి, ఉప్పు లేని నీటిని నిల్వ చేయడానికి జియో మెమోరియల్ షీట్ల సహాయంతో 1.15 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక నీటి నిల్వ ట్యాంక్‌ను నిర్మించింది.
ఇన్-పేషెంట్ డిపార్ట్‌మెంట్, అవుట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్, డయాగ్నస్టిక్ బ్లాక్, మెడికల్ కాలేజ్ మొదలైన నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అవ్వగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. హేలాపురి ప్రజల ఐదు దశాబ్దాల కోరికను ప్రభుత్వం నెరవేర్చింది. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణాన్ని 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టారు. ఒక వైద్య కళాశాల, 24X7 అక్యూట్ కేర్ బ్లాక్, మాతాశిశు సంరక్షణ భవనం, హాస్టల్స్, స్టాఫ్ క్వార్టర్స్, రోగులు, సహాయకుల వసతి గృహం, క్యాంటీన్ల విస్తరణ వంటి ఐదు కీలక బ్లాకులు అందుబాటులో వచ్చాయి. నంద్యాల మెడికల్ కళాశాల సైతం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేశారు. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఆడిటోరియం సిద్ధమయ్యాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)