AP PRC : గురువారమే పీఆర్సీ ఎపిసోడ్‌కు ముగింపు.. ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ ఖరారు !?
పీఆర్సీ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్న సీఎం జగన్ గురువారం ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలతో గురువారం ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంతో భేటీ గురించి ఉద్యోగ సంఘ నేతలకు సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. పీఆర్సీ అంశంపై కొద్ది రోజులుగా ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తోంది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో వరద బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం జగన్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు - ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలో పీట ముడిపోయింది. వివాదం తేలలేదు.
Also Read: ఇక సీఎంతోనే చర్చలు... 9 తర్వాత సమ్మెకైనా వెనుకాడబోమంటున్న ఏపీ ఉద్యోగ సంఘాలు !
పలుమార్లు స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగినప్పటికీ వివాదం తేలలేదు. ఫిట్‌మెంట్ 34 శాతం ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఏపీ అర్థిక పరిస్థితిని దాదాపుగా ప్రతి సమావేశంలోనూ అధికారులు వివరిస్తూ వస్తున్నారు. వస్తున్న ఆదాయం అంతా జీత, భత్యాలకే సరిపోతుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వ వాదనతో అంగీకరించడం లేదు. ఇక అధికారులతో చర్చలు జరపబోమని నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరుపుతామని ఉద్యోగులు ప్రకటించారు.
Also Read: పీఆర్సీపై అదే గోప్యత..మరోసారి ఉద్యోగ సంఘ నేతల అసంతృప్తి !
ఈ వివాదానికి ముగింపు పలకాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందుకే ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై దృష్టి పెట్టారు. బుధవారం పీఆర్సీ అంశాన్ని డీల్ చేస్తున్న ఉన్నతాధికారులతో సమావేశం అయి .. ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను తెలుసుకున్నారు. ఎంత మేర ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత భారం పడుతుంది.. ఆర్థిక వనరులు ఎలా అందుబాటులో ఉన్నాయి.. వంటి వివరాలతో పూర్తి నివేదికను సీఎంకు అధికారులు అందించారు. సీఎం ఓ నిర్ణయం తీసుకుని.. రేపు ఉద్యోగ సంఘాల భేటీలోనే ప్రకటిస్తారు. సీఎంతో భేటీ తర్వాత పీఆర్సీ వివాదం సద్దుమణిగిపోతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలు గతంలో ఆందోళన బాట పట్టినా ఇటీవల ఉపసంహరించుకున్నాయి. తొమ్మిదో తేదీ వరకూ చూస్తామని అప్పటిలోపు ప్రభుత్వం స్పందించకపోతే.. ఎక్కడ ఆపామో.. అక్కడి నుంచే ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తారా... పీఆర్సీ ప్రకటనతో సంతృప్తి చెందుతారా అన్నది గురువారం తేలిపోయే అవకాశం ఉంది.
Also Read: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి