YSR Asara Scheme: మహిళలకు ఏపీ సర్కారు శుభవార్త - 25న మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ
YSR Asara Scheme: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏపీ సర్కారు మూడో విడత సొమ్ము జమ చేయనుంది. ఈ మేరకు 10 రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది.
YSR Asara Scheme: వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏపీ సర్కారు మహిళలు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని సర్కారే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జమ చేయనున్న మొత్తం కలిపితే మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లను సర్కారు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్లు కానుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా వాడుకోవచ్చని సర్కారు గతంలోనే స్పష్టం చేసింది.
10 రోజుల పాటు వేడుకలు..
వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను జగన్ సర్కారు 10 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుండి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. రోజూ కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే సమాచారం చేరవేత
మూడో విడతల ఏమేరకు లబ్ధి చేకూరనుందో ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు, పట్టణ రిసోర్సు పర్సన్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. మార్చి 18 నుండి 20 వ తేదీ వరకు సెర్ప్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులు అందరితో సమావేశాలు నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సమావేశాలు జరుగుతాయి. 2014 లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింద. దాంతో మహిళలెవరూ రుణాలు చెల్లించలేదు. దీంతో ఆ రుణాల వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ సర్కారు రుణాలు మాఫీ చేయక పోవడంతో.. పొదుపు సంఘాలు చిన్నాభిన్నమైపోయాయి. 'ఏ' కేటగిరీ సంఘాలు కూడా 'సీ', 'డీ' కేటగిరీలుగా దిగజారాయి. ప్రస్తుతం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి పొదుపు సంఘాలు పూర్వరూపు సంతరించు కుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల్లో దాదాపు 91 శాతం ఏ, బీ గ్రేడుల్లో కొనసాగుతున్నాయి. సర్కారు లెక్కల ప్రకారం పొదుపు సంఘాలు తిరిగి సకాలంలో రుణాలు చెల్లిస్తున్నాయి. పొదుపు సంఘాల మహిళలు 99.55 శాతం మంది తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు.