CM Jagan Comments: బాబు ఎన్నికల ముందు గంగ, తర్వాత చంద్రముఖి - పల్నాడు సభలో జగన్ ఎద్దేవా
AP Elections 2024: పల్నాడు జిల్లాలోని అయ్యప్ప నగర్‌లో వైఎస్ఆర్ సీపీ మేమంతా సిద్ధం పేరుతో భారీ సభ నిర్వహించారు. ఇందులో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు.
CM Jagan in Palnadu District: ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావని.. మనం వేసే ఓటుతో మన తలరాతలు మార్చే ఎన్నికలు అని సీఎం జగన్ అన్నారు. గత 58 నెలలుగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను భరోసా అని అన్నారు. ఇది జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని.. ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. ఇందులో జగన్ పేదల పక్షపాతి అని అన్నారు. కాబట్టి, కుటుంబంలోని ప్రతి ఓటు వైఎస్ఆర్ సీపీకి వేయాలని పిలుపు ఇచ్చారు. ప్రతి ఒకరు లోతైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జగన్ కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుందని.. చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ మంచి, పథకాలు అన్ని ఆగిపోతాయని అన్నారు.
పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల సమీపంలో అయ్యప్ప నగర్‌లో వైఎస్ఆర్ సీపీ మేమంతా సిద్ధం పేరుతో భారీ సభ నిర్వహించారు. ఉదయం నుంచి బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ అయ్యప్ప నగర్‌లో నిర్వహిస్తున్న సభలో మాట్లాడారు.
‘‘చంద్రబాబు అంటేనే ఎన్నికల ముందు గంగ. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని తాగే చంద్రముఖి. ఇప్పుడు మనం జాయింట్ గా ఓ ఫ్యాక్ట్ చెక్ చేద్దామా? చంద్రబాబు గురించి ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం చూద్దాం. వీరు ఎంత ప్రమాదకారి అంటే.. వీరు చంద్రబాబుతో కూడబలుక్కొని ఒక గాడిదను తీసుకొస్తారు. ఆ గాడిదను గుర్రం అంటూ పదే పదే ఊదరగొడతారు. వీరి మోసపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54 వేల పోస్టులు భర్తీ చేశాడు. గతంలో ఇదే కాలంలో చంద్రబాబు కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే నియామకం చేశారు. మరి జాబు కావాలంటే ఫ్యాను రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?