CM Chandrababu: 'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Andhra News: 10 పాయింట్ల ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధిలో ముందుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు.
CM Chandrababu Key Decision: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశాఖ పర్యటనలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని అన్నారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. జీరో పావర్టీ దిశగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. 'ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో నెంబర్ వన్ కావాలి. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధిలో దూసుకెళ్లాలి. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలి. అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలో మనమే నెంబర్ వన్ కావాలి. పీ 4 విధానంలో సంపద సృష్టిద్దాం.' అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం డబ్బు కంటే మంచి ఆలోచనే ముఖ్యమని అన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్ లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు.#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/t5ro2NPvEL
— Telugu Desam Party (@JaiTDP) November 2, 2024
'రుషికొండ భవనాలపై..'
అంతకు ముందు వైసీపీ హయాంలో రుషికొండలో నిర్మించిన భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనంతో తన స్వార్ధం కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజాకోర్టులో చర్చ జరగాలని తెలిపారు. 'ప్రజాస్వామ్యoలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా.? అని ఆశ్చర్యం కలుగుతుంది. గుండె చెదిరిపోయే నిజాలు ఇక్కడ కనిపించాయి. ఇలాంటి నేరాలు చెయ్యడానికి చాలా గుండె ధైర్యం కావాలి. చాలా దేశాలు తిరిగాను కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్యాలెస్ కట్టడం ఎక్కడా చూడలేదు. నిజాం ప్యాలెస్ పలక్నుమా ప్యాలెస్ చూశా. ఈ ప్యాలెస్ చూస్తే ఆశ్చర్యం, ఉద్వేగం కలిగింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రూ.430 కోట్లతో ఈ ప్యాలెస్ కట్టారు. 7 బ్లాక్‌ల్లో 13,548 చ.మీటర్లలో కట్టడమే కాకుండా చుట్టూ ఉన్న 18 ఎకరాలను జపాన్ టెక్నాలజీతో కొండ చుట్టూ ప్రొటెక్షన్ కట్టించారు. పీఎం, ప్రెసిడెంట్ విడిది కోసం కడుతున్నామని అన్నారు. వారు నావెల్ గెస్ట్ హౌస్‌లొనే ఉన్నారు. వారు ఇలాంటి ప్యాలెస్‌లను కట్టమని అడగలేదు కదా.' అని పేర్కొన్నారు.
ప్యాలెస్‌లో బాత్ టబ్‌కు రూ.36 లక్షలు, కమోడ్‌కు రూ.12 లక్షలు, 9.88 ఎకరాల్లో 7 బ్లాక్‌లతో విలాసవంతమైన ప్యాలెస్ పర్యావరణానికి విధ్వంసం చేసి నిర్మించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాలెస్ సమూహం దేనికి ఉపయోగపడుతుందో తెలియడం లేదన్నారు. 'దేశంలో అత్యంత అరుదైన ప్రదేశం.. దేనికీ పనికి రాకుండా భవంతులు కట్టేశారు. ఈ ప్రాంత సరిహద్దుల్లోకి ఎవరినీ రాకుండా కట్టడి చేసి, ఎన్జీటి, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టి, అధికారులను భయపెట్టి ప్రజల్ని మోసం చేశారు. కళింగ బ్లాక్‌లో 300 మందికి కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. ప్రజలకు ఈ విషయాలు తెలియాలి.' అని పేర్కొన్నారు.