CM Chandrababu: వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే - పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశం
Vijayawada Floods: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు, కొల్లేరు డ్రెయిన్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
CM Chandrababu Aerial Survey In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) చేశారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. వీటిపై పూర్తి వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు, షాపుల్లో బురదను తొలగించాలని.. చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. వరదలకు ఇళ్లల్లో చెడిపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలని సూచించారు. అటు, బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత పనులను అధికారులు సీఎంకు తెలిపారు.
రంగంలోకి ఆర్మీ
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడ్డ మూడవ గండిని శుక్రవారం ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే పనులు జరుగుతున్న విజువల్స్ pic.twitter.com/2tvWuxhltr
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 6, 2024
మరోవైపు, బుడమేరు గండ్ల పూడ్చివేతలో భారత ఆర్మీకి చెందిన టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. ఇప్పటికే పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన రెండు గండ్లను పూడ్చివేశారు. ఎన్డీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద గండిని పూడ్చివేత పనులను ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక పరికరాలతో రంగంలోకి దిగగా.. శుక్రవారం సాయంత్రం వరకూ గండిని పూడ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గండ్ల పూడ్చివేతతో విజయవాడకు వరద ప్రవాహం తగ్గనుంది.
బాధితులకు నిత్యావసరాల కిట్లు
అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర కిట్లను ప్రభుత్వం అందిస్తోంది. దాదాపు 2 లక్షల కుటుంబాలకు వీటిని అందించేలా చర్యలు చేపట్టింది. మొదటి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు అందించారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె అందజేస్తున్నారు. ఈ పోస్ మిషన్ ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డు లేని వారికి.. ఆధార్, బయోమెట్రిక్ ద్వారా కిట్ ఇస్తున్నారు.
విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద తగ్గలేదు. అజిత్ సింగ్ నగర్‌లోని పలు ప్రాంతాల్లోకి గురువారం కంటే శుక్రవారం మరో అడుగు నీరు చేరింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతుండగా స్థానికులు బంధువులు ఇళ్లకు వెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేశారు. వైద్య శాఖ బాధితులకు మందులు పంపిణీ చేస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వరద బాధితులకు తక్కువ ధరకే కూరగాయలు అందిస్తున్నారు.