Kottu Satyanarayana : కాణిపాకం ఆలయంలో బంగారు ఆభరణం మాయం, తప్పు చేస్తే శిక్ష తప్పదని మంత్రి కొట్టు హెచ్చరిక
Kottu Satyanarayana : కాణిపాకం ఆలయంలో బంగారు విభూదిపట్టి మిస్సింగ్ వ్యవహారంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఓ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Kottu Satyanarayana : కాణిపాకం ఆలయంలో తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏపీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్ధం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ పాలకమండలి ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో రాణా ప్రతాప్ లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం చేసుకున్న మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కాణిపాకం ఆలయంలో తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామి వారికి బంగారు విభూదిపట్టి సుమారు 18 లక్షల రూపాయలు విలువ ఉంటుందని, దానిని ఒక భక్తుడు విరాళంగా ఇస్తే, దానిని ఆలయంలో పని చేసే ఒకరు తీసుకొని ఏ ఒక్క రసీదు ఇవ్వకుండా 40 రోజులు తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఓ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
అసలేం జరిగింది?
కాణిపాకం ఆలయంలో నిత్యం దాదాపుగా ఇరవై వేలకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని విరాళంగా అందించారు.
18 లక్షల విలువైన ఆభరణం
ఓ దాత అందించిన విభూతి పట్టీ ఉన్నట్టుండి మాయం అయ్యింది. ఆలయం విరాళాల రశీదు పుస్తకంలో విరాళానికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో విరాళం విషయాన్ని అధికారులు, పాలక మండలి మరిచిపోయింది. ఇంతలో దాత తనకు రశీదు పత్రం అందించలేదని కోరడంతో గుర్తు చేసుకున్న అధికారులు విభూతి పట్టి ఆభరణంపై ఆరా తీశారు. నలభై ఐదు రోజులగా ఆలయంలో కనిపించని ఆభరణం ఉన్నట్టుంది ఆలయంలోని యాగశాలలో ప్రత్యక్షం అయ్యింది. అయితే కాణిపాకం ఆలయంలో భక్తుడు స్వామి వారిపై భక్తిభావంతో విభూది పట్టీని విరాళంగా ఆలయ కుంభాభిషేకం నాడు అందజేశారు. అయితే కుంభాభీషేకం ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన నిర్వహించారు. భక్తులతో ఆలయంలో హడావిడిగా ఉండే సమయంలో వేలూరుకు చెందిన ఒక ట్రస్ట్ నుంచి కుంభాభిషేకం రోజు సుమారు 18 లక్షలు విలువ చేసే బంగారు విభూదిపట్టిని విరాళంగా ఆలయ అర్చకుడి చేతికి అందజేశారు. కుంభాభిషేకం రోజు స్వామి వారి మూలవిరాట్ కి అలంకరించి తర్వాత ఆలయ అర్చకుడు బంగారు విభూదిపట్టిని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. ఆలయ అధికారులు సైతం కుంబాభిషేకం రోజు స్వామివారి పైన ఉన్న బంగారు విభూదిపట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అనే సంగతి అడగటం మరచారు.
40 రోజుల తర్వాత
అసలు విరాళం అందిన సంగతి అధికారులకు గానీ, పాలక మండలికి గానీ తెలియక పోవడంతో ఆభరణం గురించి ఎవరూ అడగలేదు. ఆలయ కుంభాభిషేకం అనంతరం 10 రోజుల తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21 రోజులు నిర్వహించారు. అయితే తాము అందించిన విరాళానికి తమకు ఎటువంటి రశీదు ఇవ్వలేదని దాత అధికారులను కోరారు. దీనిపై ఆరా తీసిన అధికారులు ఎవరికి ఇచ్చారో విచారణ చేపట్టారు. దీంతో విషయం బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన పది రోజుల తరువాత వెలుగు చూసింది. ఆలయంలో పని చేస్తున్న అర్చకుడు ఆ విభూతిపట్టీకి ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోని బీరువాలో దాచుకున్నాడు. బంగారు విభూదిపట్టి విరాళం ఇచ్చిన దాతలు 40 రోజులైనా వాళ్లకు స్వామి వారి ఆలయం నుంచి విభూదిపట్టి విషయంలో ఎటువంటి రశీదు రాకపోవడంతో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీసిన మంత్రికి అధికారులు విషయం మొత్తం తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న అర్చకుడు ఏం ఎరుగనట్టు బంగారు విభూధి పట్టీని ఎవరికి తెలియకుండా ఆలయంలోని యాగశాలలో ఉంచాడు.