Paleti Ramarao : 'మరణ దినం' వేడుకలు నిర్వహించుకున్న మాజీ మంత్రి, ఇంకా 12 ఏళ్లే జీవిస్తారట!
Paleti Ramarao : మరణ దిన వేడుకలకు ఆహ్వానం అంటూ ఓ మాజీ మంత్రి విచిత్ర ప్రకటన చేశారు. ఇంకా 12 ఏళ్లు మాత్రమే జీవిస్తానంటూ చెప్పుకొచ్చారు.
Paleti Ramarao : ఆయనో మాజీ మంత్రి. విన్నూత వ్యవహారాలు ఊహించని చర్యలతో నిత్యం వార్తల్లోకెక్కడం ఆయనకి అలవాటు. ఇవాళ ఆయన జన్మదినాన్ని మరణ దినం పేరుతో నిర్వహిస్తూ మరోసారి అందరి దృష్టిని వార్తల్లో నిలిచారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్.టి.ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజును పురష్కరించుకొని మరణదిన వేడుకలకు ఆహ్వానంటూ ఇన్విటేషన్ కార్డులను కొట్టించారు. ఈ విషయం చీరాలలో హట్ టాఫిక్ గా మారింది. ఇన్విటేషన్ కార్డులో ఇప్పటికి నాకు 63 ఏళ్లు పూర్తతాయని, ఇక జీవించేది 12 సంవత్సరాలు అని జోస్యం చెప్పారు. 1959వ సంవత్సరంలో పుట్టానని, 2034లో మరణం ఉంటుందని ఆహ్వాన కార్డులో రాశారు. ఇవాళ జరుపుకునేది 12వ మరణ దినోత్సవం అన్నారు. ఇక్కడ నుంచి 12 ఏళ్లు మాత్రమే జీవిస్తానన్నారు. చీరాల ఎ.ఎం.ఐ హాలులో మరణ దిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
వైరల్ అవుతున్న మరణ దిన వేడుక పత్రిక
తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకొన్న పాలేటి రామారావు బతికుండగానే మరణదినోత్సవం నిర్వహించుకున్నారు. దానికి ఆయన ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించుకున్నారు. విచిత్రమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు డాక్టరు పాలేటి రామారావు. చీరాలకు చెందిన ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయనకు 63 ఏళ్లు. 75 ఏళ్ల వయసులో అంటే 2034లో తాను చనిపోతానని అంచనా వేసుకుని ఏటా మరణ దినం చేసుకుంటున్నట్లు ఇన్విటేషన్ ముద్రించుకున్నారు. తన మరణానికి ఇంకా 12 ఏళ్లు ఉన్నాయని భావించిన ఆయన శనివారం చీరాల పట్టణంలో 12వ మరణ దినం పేరిట వేడుకలు చేసుకున్నారు. మనిషి మరణ భయం వీడి, తన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇలాంటి వేడుకలు అవసరమన్నారు. అందుకే తొలిసారిగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది 11వ మరణ దినం వేడుకలు చేస్తానంటున్నారు. ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరణ దిన లేఖలో మ్యాటర్
ఈ ఆహ్వాన పత్రికలో "భగవంతుడు ఎంత బోధించినా మానవుడు తన జీవన గమనాన్ని ఆలోచనా విధానాన్ని పూర్తిగా సరిచేసుకోలేక పోతున్నాడు. పరులకు అపకారం జరిగే పనులను ఆపుకోలేకపోతున్నాడు. దేవుళ్లందరూ మానవుడు తప్పక మరణిస్తాడని, జీవించి ఉన్న కాలంలో పరులకు అపకారం చేయకుండా, ఉపకారం మాత్రమే చేయాలని నేర్పించారు. మానవుడు ఒక జీవి దశ నుంచి మనిషి దశలోకి మారాలన్నది భగవంతుల ఆశ. జీవిగా ఉన్నంత కాలం తను బతికితే చాలనుకుంటాడు. కాని మనిషిగా మారిన తర్వాత పరులను కూడా బతికిస్తాడు. మానవుడు తన మరణ స్థితిని ఊహలోకిని రానివ్వలేకపోతున్నాడు. అందువల్ల భగవంతుడు నేర్పించిన దానిని అమలులోకిని తేలేకపోతున్నాడు. మానుడు తనెంతకాలం జీవించాలనుకుంటున్నాడో తానే ఆలోచించుకొని తన మరణ సంఘటనకు ఒక తేదీని నిర్ణయించుకోగలిగితే, తాను కచ్చితంగా మరణిస్తానని గ్రహించి ఇంత కాలం జీవించాం కాబట్టి, ఇంకెంత కాలం జీవిస్తామో లెక్క వేసుకోవాలని సూచించారు. కొద్ది కాలమే జీవిస్తానని తెలుసుకున్న అనంతరం భగవంతుడు నేర్పించిన విధంగా జీవి దశ నుంచి మనిషి దశలోకి మారే ప్రయత్నం చేయాలన్నారు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తొలిప్రయత్నంగా తాను మరణ దినం నిర్వహిస్తున్నాను. తాను ఎంత కాలం జీవించాలనుకుంటున్నానో ఆలోచించి, మరణానికి ఒక తారీఖును నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు ఎంతకాలం జీవించానో తేల్చి ఇంకెంత కాలం జీవిస్తానో లెక్కించి అన్ని మరణ దినాలను జరుపుకుంటున్నాను' అని రాశారు.