Chandrababu: నాలుగేళ్లలో 3 వేల మంది రైతుల ఆత్మహత్య - సాగు రంగాన్ని నట్టేట ముంచారని జగన్‌పై చంద్రబాబు ఫైర్ !
ఏపీలో వ్యవసాయ రంగాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇంత అసమర్థమైన పాలన ఎక్కడా చూడలేదన్నారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేల్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని 93 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. జగన్ కు సీఎంగా ఉండే అర్హతలేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని విమర్శించారు. ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో సాగును చంపేశారని..రైతులను నిండా అప్పుల్లో ముంచేశారని ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణమైన జగన్ సీఎంగా ఉండటానికి అర్హతలేదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో 93శాతం రైతులు అప్పులపాలయ్యారని తెలిపారు. తప్పుడు లెక్కలు చూపించటంలో జగన్ సిద్దహస్తుడు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులకు రూ పదమూడు వేలు ఇస్తామని..ఎంత ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము ఒకే విడత రుణమాఫీ రూ. యాభై వేలు చేశామని.. జగన్ మాత్రం.. పదిహేను సార్లు ముప్ఫై వేలు కూడా ఇవ్వకుండా... అన్ని సార్లు ప్రకటనలు ఇచ్చుకుని ప్రచారం చేసుకున్నారన్నారు. గతంలో తాను రైతులకు యూనిట్ లకు రెండు రూపాయలకే విద్యుత్ అందించామని.. కానీ తాను అధికారంలోకి వస్తే జగన్ రూ.1.50లకే విద్యుత్ ఇస్తానని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చాక యూనిట్ రూ.3.85లు చేశారు అంటూ విమర్శించారు. తాను మరోసారి చెబుతున్నానని తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.1.50లకే విద్యత్ ఇస్తాం అని హామీ ఇచ్చారు చంద్రబాబు.
వాటర్ సెజ్ చూస్తే 1000లీటర్లకు రూ.12లు ఉంటే దాన్ని రూ.120చేశారని రూ.12 పక్కన సున్నా పెట్టిన ముఖ్యమంత్రికి సున్నాకు కూడా విలువ తెలీదు..ఆ సున్నా భారం ఎంతో కూడా తెలియని ముఖ్యమంత్రి జగన్ అంటూ అంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఉండే రాష్ట్రంలో ఈ నీటి దోపిడీ ఏంటీ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం హాయంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆక్వా రైతులకు పుష్కలంగా నీరు అందించామని..కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆక్వారైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని.గిట్టుబాటు ధర లేక ఓ వైపు..అధిక విద్యుత్ చార్జీలు మరో వైపు అలా నష్టాల్లో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారని విధి విధానాలు తెలియనివారు సీఎం అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి అంటూ విమర్శలు చేశారు.
ఆయిల్ పామ్ పండింటంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండేదని ఆ పంటల పరిస్థితులు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చిందని గుర్తు చేశారు. రైతులకు మొక్కల పంపిణీ చేయక..సబ్సిడీలు కూడా ఇవ్వక ఆయిల్ పామ్ పంటలు వేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఇలా ఏపీలో ఏ పంట గురించి చెప్పినా కష్టాలు, నష్టాలు తప్ప చెప్పుకోవటానికి ఏమీ లేదు అంటూ విమర్శలు సంధించారు చంద్రబాబు.