Chandrababu : చంద్రబాబు కంటికి మంగళవారం ఆపరేషన్ - ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో టెస్టులు !
చంద్రబాబు కంటికి మంగళవారం ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో టెస్టులు నిర్వహించారు.
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించే అవకాశం ఉంది. ముందస్తు పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు టీడీపీ చీఫ్ వెళ్లారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆపరేషన్ తేదీనిఖరారు చేస్తారు. మగళవారం చేయవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్నారు. కుడి కంటికి చేయించుకోవాల్సి ఉంది.
వైద్య పరీక్షల కోసం చంద్రబాబు గురువారం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం చంద్రబాబుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, అలర్జీ స్క్రీనింగ్, కాలేయ, మూత్రపిండాల పనితీరు, ఇతర టెస్టులు చేశారు. వాటి ఫలితాల ఆదారంగా వైద్యులు చికిత్స చేయనున్నారు. చంద్రబాబు జైలులో తీవ్ర అలర్జీ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ లభించడంతో చంద్రబాబు బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఏఐజీ గురువారం ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఒకరోజు అక్కడే ఉన్న చంద్రబాబుకు వైద్యులు వివిధ పరీక్షలు చేశారు.
రాజమండ్రి జైలులో చంద్రబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. గతంలో చంద్రబాబు కంటికి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.. చంద్రబాబుకు ఉన్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఓ నివేదికలో వివరించారు. కంటిలో శుక్లాలు ఏర్పడ్డాయని.. ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3 నెలల్లో కుడి కంటికి సర్జరీ చేయాలని సూచించారు. ఆ మేరకు వైద్య సంబంధ కారణాలతో కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోగ్య కారణాలతో మాజీ ముఖ్యమంత్రి అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. పార్టీ క్యాడర్, అనుచరులు, అభిమానుల అపూర్వ స్వాగతం మధ్య టీడీపీ జాతీయ అధ్యక్షుడు నవంబర్ 1న హైదరాబాద్ చేరుకున్నారు.