Chandrababu: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ, జగన్ చేయబోయే పని వెంటనే అడ్డుకోవాలని వినతి
AP Latest News: ఏపీలో ఎన్నికలు ముగిసినందున జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని చంద్రబాబు ఆరోపించారు.
![Chandrababu: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ, జగన్ చేయబోయే పని వెంటనే అడ్డుకోవాలని వినతి Chandrababu Naidu writes letter to AP Governor Abdul Nazeer over funds release to contractors Chandrababu: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ, జగన్ చేయబోయే పని వెంటనే అడ్డుకోవాలని వినతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/14/e2bd6609ae7f710cc77abd54c00cb57b1715695826721234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu letter to Governor Abdul Nazeer: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన వేళ సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని చంద్రబాబు ఆరోపించారు. దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని గవర్నర్ కు లేఖలో కోరారు. లబ్దిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని చంద్రబాబు వివరించారు.
లేఖలో ఇంకా పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోంది. కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారు. ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికల కోడ్ కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమకాలేదో చెప్పాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
‘‘అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది. రుణాలు కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది.
రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సిఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. లబ్దిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలి’’ అని చంద్రబాబు గవర్నర్ ను కోరారు. ఈ లేఖను గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జత చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)