Chandrababu Naidu Arrest: IRR కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట- బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 3కు విచారణ వాయిదా
Chandrababu Naidu Arrest: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు ఇవాళ ఊరట దక్కలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.
Chandrababu Naidu Arrest: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇటీవల దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించగా.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వర్చువల్ విధానంలో వాదనలు వినిపించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు పాత్ర లేదని సిద్దార్థ్ లూధ్రా హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఇక ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ తర్వాత లింగమనేనికి లబ్ధి చేకూరిందని అన్నారు. లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఆక్రమణలకు పాల్పడ్డాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేడింది. అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరగ్గా.. అక్టోబర్ 4వ తేదీకి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దని సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 5న చేపడతామని తెలిపింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. లోకేష్‌కు 41ఏ నోటీసులు జారీ చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. సీఐడీ విచారణకు లోకేష్ సహకరించాలని సూచించింది. ఈ కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇక ఫైబర్ నెట్ కేసులో కూడా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 4కు వాయిదా పడింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా కేసును విచారించాలని కోరారు. దీంతో మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఏ25గా సీఐడీ చేర్చింది. దీనికి సంబంధించి ఇటీవల ఏసీబీ కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్ అనే కంపెనీకి ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కట్టబెట్టారని చంద్రబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారామయ్య టెరాసంస్థకు కూడా డైరెక్టర్‌గా ఉన్నారని సీఐడీ ఆరోపిస్తోంది. బిడ్డింగ్ గడువు ముగియడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని, ఆ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి రూ.284 కోట్లు విడుదల చేసినట్లు సీఐడీ చెబుతోంది.