Chandrababu Tour : వివేకాను చంపినంత ఈజీగా చంపుతామంటున్నారు - తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న చంద్రబాబు !
చంపుతామని వైఎస్ఆర్‌సీపీ నేతేలు చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో బయట పెట్టాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
Chandrababu Tour : వైఎస్ వివేకానందరెడ్డిని చంపినంత తేలికగా తననూ చంపుతామని బెదిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..” కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మొద్దుశీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పి ఉంటే..తనను ఇంట్లోనే చంపేసి ఉండేవారమని బెదిరిస్తున్నారని... ఇప్పుడు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకున్నామంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు పోలీసుల ఉంటే తనకు ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చారని.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. అత్యుత్తమైన ధర్మాసనం చెప్పినా సీఎం నోరు విప్పకుండా ఉన్నారంటే రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ విమర్శలు గుప్పించారు.
టీడీపీ మీటింగ్‌లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని.. ప్రజల్లో చైతన్యం రావాలని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని.. అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..” కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు. లండన్ బాబుని శాశ్వతంగా లండన్ పంపిస్తానని హెచ్చరించారు. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం వుండవని ఆయన ప్రజలను హెచ్చరించారు. కేంద్రాన్ని మెప్పించి పోలవరంకి అన్ని అనుమతులు తీసుకు వచ్చామంటూ పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన మంత్రికి డయాఫ్రమ్ వాల్ ఎక్కడ వుంటుందో తెలీదంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశాం.. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని ఆరోపించారు. తనకేం కొత్త చరిత్ర అవసరం లేదు.. ఇపుడు ప్రజలు కళ్ళు తెరవాలి.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. తనకు కాదన్నారు.
50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా 'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించింది. దీని కోసం మొత్తం 8వేల మంది పార్టీ బృందాలను నియమించారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం, ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు 7, 8 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దాంతో పోలిస్తే ఇదేం కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు. స్వయంగా చంద్రబాబు కూడా పలు చోట్ల పాల్గొంటారు.