Chandrababu Case : చంద్రబాబుకు గుండె సమస్య - హైకోర్టుకు సమర్పించిన హెల్త్ రిపోర్టులో సంచలన విషయాలు !
Chandrababu Case : చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్య కూడా ఉందని హైకోర్టుకు లాయర్లు హెల్త్ రిపోర్ట్ సమర్పించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణలో వైద్యుల నివేదిక సమర్పించారు.
Chandrababu Case : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుండె సమస్య కూడా ఉందని వైద్యల పరీక్షల్లో వెల్లడయింది. బెయిల్ నిబంధనల ప్రకారం కంటి ఆపరేషన్ , హెల్త్ కండీషన్ వివరాలను హైకోర్టుకు న్యాయవాది అందజేశారు. ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చికిత్స వివరాలను అందులో పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు చర్మ సంబంధిత చికిత్స ,గుండె సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కాల్షియం స్కోర్ అధికంగా ఉందని వైద్యులు తెలిపారని అంటున్నారు. అదే సమయంలో గుండె పరిణామం పెరిగిందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు. అలాగే గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరం
అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాలని వైద్యులు సూచించారని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం మధమేహం అదుపులో ఉందని.. అయితే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు కోర్టుకు మెమోలో తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్, హెల్త్ కండీషన్ వివరాలకు సంబంధించిన నివేదికను న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టుకు అందజేశారు. చంద్రబాబు నాయుడు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. చంద్రబాబు కంట్లో ఐదు వారాలపాటు చుక్కల మందు వేయించాల్సిన అవసరం ఉందని మెమోలో తెలిపింది. ఐదు వారాలపాటు ఇన్ ట్రా ఆక్యుకలర్ ప్రెజర్ చెకప్ తప్పనిసరి అని వైద్యులు సూచించినట్లు న్యాయవాది తెలిపారు. ఈమేరకు ఐదువారాలపాటు కంటి చెకప్ కోసం షెడ్యూల్‌ను కోర్టుకు అందజేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు ఐదు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబు నాయుడు మరికొన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మెడిసిన్స్ వాడాల్సి ఉందని వైద్యులు సూచించారని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు మోమోలో కోర్టుకు తెలియజేశారు.
బెయిల్ పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టగా.. సీఐడీ తరఫు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నాం 12.15లకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదనపు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌పై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది ఆయన హెల్త్ నివేదికన మెమో రూపంలో కోర్టుకు అందజేశారు. సమయం అయిపోవడంతో గురువారానికి వాయిదా వేశారు.
టీడీపీ ఖాతాల వివరాలు కోరామన్న సీఐడీ
సీఐడీ హైకోర్టులో అదనపు అఫడవిట్ లో తెలుగుదేశం పార్టీ ఖాతాలకు సంబంధించి వివరాలు కోరామని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ కార్యదర్శికి నోటీసులు అందజేసినట్లు తెలిపింది. పార్టీల ఖాతాల వివరాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని కోరుతూ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు చెప్పారు.