White Paper on Law and Order : అసెంబ్లీలో ఉన్న మూడోవంతు సభ్యులపై జగన్ అక్రమ కేసులు - లా అండ్ ఆర్డర్ పై చంద్రబాబు శ్వేతపత్రం
Andhra Pradesh : జగన్ హయాంలో లా అండ్ ఆర్డర్ పై శ్వేతపత్రాన్ని చంద్రబాబు ప్రకటించారు. పూర్తిగా రాజకీయ కక్షల కోసమే పోలీసుల్ని వాడుకున్నారని.. శాంతిభద్రతల్ని గాలికొదిలేశారని మండిపడ్డారు.
Chandrababu On law And Order : జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం అంతా రావణకాష్టంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ హయాంలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రకన చేశారు. ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికి ఏకంగా జీవో 1 తీసుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్ని బయటకు రాకుండా చేయడానికి ఇష్టం వచ్చినట్లుగా కేసులు నమోదు చేశారన్నారు. ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డిపై అరవైకిపైగా కేసులు పెట్టారన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో కేసులు నమోదైన ఎమ్మెల్యేలు లేచి నిలబడాలని చంద్రబాబు కోరారు. సభలో ఉన్న వారిలో 80 శాతం మంది లేచి నిలబడ్డారు. ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టారని.. కేసులు పెట్టి బయటకు రాకుండా చేద్దామనుకున్నారు... కానీ ప్రజలు అసెంబ్లీకి పంపారని చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయం కోసంఉద్యమం చేస్తున్న ఉపాధ్యాయులపైనా జర్నలిస్టులపైనా కేసులు పెట్టారన్నారు. తప్పుడు కేసులపై సమీక్షిస్తానని చంద్రబాబు ప్రకటించారు.
రాజకీయ కేసులు పెట్టేందుకే పోలీసులు
గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సయ్యారని కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వైసీపీ పాలనలో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డారని వైసీపీ నేతలకు అండగా పోలీసులు ఉండడంతో చెలరేగిపోయారన్నారు. తనపైన కూడా అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. తనపై 17 కేసులు, పవన్ కల్యాణ్‌పై 7 కేసులు పెట్టారని దాడులు జరిగినా సరే ఏమాత్రం భయపడలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
గంజాయి కట్టడికి ఒక్క సారైన సమీక్ష చేశారా ?
అమరావతి మహిళా రైతుల బాత్రూమ్‌లపై డ్రోన్లు ఎగరవేశారని .. జగన్ హెలికాప్టర్ లో వెళ్లినా.. పరదాలు కట్టారు.. చెట్లు కొట్టారని మండిపడ్డారు. ఏపీలో గంజాయి లేని గ్రామం లేదని గుర్తు చేశారు. ల ఒక్కసారైనా గంజాయిపై జగన్ సమీక్ష చేయలేదన్నారు. దేవాలయాలపై దాడులు చేశారు, దోపిడీలు చేశారు. జగన్ కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామాలు ఆడారు తప్ప ఏమీ చేయలేదని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, నేరాలకు సంబంధించిన అంశాలను చంద్రబాబు వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
న్యాయవ్యవస్థని కూడా వదల్లేదు !
కోడెల శివప్రసాద్ , రఘురామకృష్ణంరాజు, పవన్‌కల్యాణ్,అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులపై ఘోరమైన కేసులు పెట్టి వేదించారన్నారు. తనపై రాళ్ల దాడి చేస్తే అలా చేయడం హక్కు అని అప్పటి డీజీపీ చెప్పారని గుర్తు చేశారు. ఆంగళ్లులో తనపైనే హత్యాయత్నం చేసి.. మళ్లీ తనపైనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను కూడా వదల్లేదని ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని..శాంతి భద్రతలు విఫలమయ్యారని వైసీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపడం సిగ్గుచేటన్నారు.
మరోసారి లోతుగా చర్చించాలన్న పవన్ కల్యాణ్
అసెంబ్లీలో అన్ని రకాల కేసులపై ప్రత్యేకంగా వివరాలు ప్రదర్శించారు. లా అండ్ ఆర్డర్ పై మరో సెషన్ ప్రత్యేకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. వచ్చే సమావేశాల్లో ఈ అంశంపై సమగ్రమైన చర్చ నిర్వహించి .. అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షద్దామని స్పష్టం చేశారు.