White Paper on Amaravati : ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Amaravati : ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఘోరమైన విధ్వంసం చేశారని చంద్రబాబు శ్వేతపత్రం ప్రకటించారు. నాడు, నేడు దృశ్యాలను ఆయన ప్రదర్శించారు. ఇన్వెస్టర్ల నమ్మకాలని చూరగొంటామన్నారు.
Chandrababu announced a white paper on Amaravati : రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం వైట్ పేపర్ విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని పూర్తి విరవాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఇప్పుడు ప్రజలు, పెట్టబడిదారుల విశ్వాసాన్ని పెంచుకుంటామన్నారు.
ల్యాండ్ పూలింగ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది !
చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా విన్-విన్ పద్ధతిలోనే ముందుకు సాగామని అమరావతిని కూడా అలాగే ప్రారంభించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించిన సమయంలో అలాగే చేశామని అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు. వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేస్ స్టడీగా చూపించిందన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రాజధానికి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా వ్యవహరించామన్నారు.
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని జగన్ ఆనాడు చెప్పారు !
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని జగన్ ఆనాడు చెప్పారని... ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని... కానీ ఆ తర్వాత ఆయన ఏం చేశారో అందరూ చూశారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చి... మన రాజధాని ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందన్నారు. సింగపూర్‌తో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నట్లు చప్పారు. సీడ్ క్యాపిటల్ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు. సెంటిమెంట్ , పవిత్రమైన లక్ష్యంతో రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే అమరావతిని రాజధానిగా ఖరారు చేశామన్నారు. దీనిని ప్రతి ఒక్కరు అంగీకరించి తీరాల్సిందేనని అన్నారు.
శాస్త్రీయంగా ఆలోచించే అమరావతి నిర్మాణం
శాస్త్రీయంగా ఆలోచించి అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్న చంద్రబాబు.. దీనికి కులం అవసరమా..? అని ప్రశ్నించారు. భవిష్యత్ ను కాంక్షించే ఎవరూ రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని స్పష్టం చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది సైతం అమరావతికి ఒకే చెప్పి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయం, నిపుణుల సలహాలతోనే నిర్ణయం తీసుకున్నా ఉద్దేశపూర్వకంగా అమరావతి రాజధానిని వ్యతిరేకించారన్నారు. రామోజీరావు కూడా రీసెర్చ్ చేసి తనకు అమరావతి పేరునే సూచించారన్నారు. దీనికి కేబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా యమునా నీటిని, మట్టిని తీసుకువచ్చారన్నారు. అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని... రాజధానికి సహకరిస్తామని చెప్పారన్నారు. అమరావతికి పార్లమెంట్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.
ఐదేళ్ల విధ్వంసంతో భారీ నష్టం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాజధానిపై చర్చ జరగాలనే ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు చంద్రబాబు. వైసీపీ నేతలు మట్టిని తవ్వారు కానీ అమరావతి మట్టిని మాత్రం తాకలేకపోయరని తెలిపారు. హైదరాబాద్ లో సిటీ నిర్మాణం చేసినప్పుడు అన్ని అంశాలను పరిశీలించి నగర అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లామన్నారు చంద్రబాబు. తాను ఉత్తరాది వైపు నుంచి హైదరాబాద్ విస్తరణకు పూనుకుంటే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారన్న ఆయన..అక్కడే డెవలప్ మెంట్ అవుతుందని చెప్పి ముందుకు వెళ్ళినట్లు గుర్తు చేశారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరమన్నారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీనిని రాజధానిగా నిర్ణయించినట్లు చెప్పారు. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి ఓ గ్యాలరీ ఉందన్నారు.
వీడియో ప్రదర్శన
జగన్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంపై చంద్రబాబు వీడియో ప్రదర్శించారు. 2019లో ఎక్కడ పనులు ఆగిపోయాయో.. 2024లో అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూపించారు. జరిగిన విధ్వంసం చూపించేటప్పుడు .. వాటి గురించి చెప్పేటప్పుడు చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.