![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
YS Viveka Case Supreme Court : ఔను.. వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు - సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ !
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు, పోలీసులు కుమ్మక్కు కావడం వల్లే విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
![YS Viveka Case Supreme Court : ఔను.. వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు - సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ ! CBI has told delayed due to the collusion of the accused and the police in the YS Viveka murder case. YS Viveka Case Supreme Court : ఔను.. వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు - సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/6c25cba21405a9c2fd95061a729baf071666097860768228_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YS Viveka Case Supreme Court : వైఎస్ వివేకా హత్య కేసులో విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సీబీఐ సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేసింది. వైఎస్ సునీత వేసిన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు నిజమేనని సీబీఐ స్పష్టం చేసింది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో సీఐగా ఉన్న శంకరయ్య... విచారణ సమయంలో కోర్టులో 164 సెక్షన్ కింద స్టేట్ మెంట్ ఇస్తామని అంగీకరించారన్నారు. తర్వాత ఆయనకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని... ఆ తర్వాత ఆయన మార్చారని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అదే సమయంలో విచారణాధికారిపైనే నిందుతులు ఎదురు కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఏపీ పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని అందుకే విచారణ జాప్యం అవుతోందని సీబీఐ స్పష్టం చేసింది.
నేరు సీబీఐ వివేకా హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పడం, నిందితులు - పోలీసులు కుమ్మక్కయ్యాని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వైఎస్ సునీత పిటిషన్‌కు బలం లభించినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో అనేక ఘటనలు జరిగాయి. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేస్తూ.. సాక్షులు..నిందితులుగా ఉన్నవారు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై కేసు కూడా నమోదు చేశారు. అదే సమయంలో వైఎస్ సునీతతోపాటు ఆమె భర్తపైనా నిందితుల కుటుంబ సభ్యులు ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వైఎస్ సునీతా రెడ్డితోపాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి బావ మరిదిపై కేసు దాఖలు చేశారు.
వివేకా హత్య ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అయితే వివేకా హత్య కేసులో సూత్రధారులు ఎవరు అనేది తేల్చి అరెస్టు చేయడంలో సీబీఐ పురోగతి సాధించలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. అయితే విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.
వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన వారు జైల్లో ఉన్నారు. సీబీఐ విచారణ కీలక దశలో ఆగిపోయింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)