AP Capital Issue: ఏపీకి విశాఖ ఒకటే రాజధాని, త్రీ క్యాపిటల్స్ అనేది మిస్‌కమ్యూనికేషన్ - బాంబు పేల్చిన బుగ్గన!
మూడు రాజధానుల అంశం కమ్యూనికేషన్ గ్యాప్ అని బుగ్గన తన ప్రసంగంలో అన్నారు. కర్ణాటకలోలాగే ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు.
గత మూడేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ తీవ్రమైన ప్రచారం చేసిన ప్రభుత్వం ఇప్పుడు దానిపై యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రానికి విశాఖపట్నం ఒకటే రాజధానిగా చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో స్పష్టంగా చెప్పారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు కోసం బెంగళూరులో మంగళవారం (ఫిబ్రవరి 14) ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు.
మూడు రాజధానుల అంశం కమ్యూనికేషన్ గ్యాప్ అని బుగ్గన తన ప్రసంగంలో అన్నారు. కర్ణాటకలోలాగే ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానంగా రాజధాని అంశంపై బుగ్గన మాట్లాడారు. దీంతో ఇప్పటి వరకు మూడు రాజధానుల లైన్ లో వైసీపీ నేతలు, మంత్రులు ఉండగా, బుగ్గన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది.
‘‘రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అక్కడ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది. ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని కర్నూల్‌లో ఏర్పాటు చేస్తాం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేం కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం’’ అని బుగ్గన మాట్లాడారు.
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెండున్నరేళ్ల క్రితం ఏపీలో మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అంటూ మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. డెవలప్ మెంట్ వికేంద్రీకరణ కోసమే ఈ పని చేస్తున్నట్లుగా వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులోనూ పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని అని ప్రస్తావించారు. వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని లెక్కలేనన్ని సార్లు, వందలకొద్దీ ప్రెస్ మీట్లలో స్పష్టం చేస్తూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆర్థిక మంత్రి బుగ్గన తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 23న రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపు ఏపీ ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో మరింత గందరగోళం నెలకొంది.