BRS in AP: ఏపీలోని 175 స్థానాల నుంచి బీఆర్ఎస్ పోటీ - తోట చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పలువురు కాపు నాయకులు, మద్దతుదారులతో హోటల్ షెల్టన్‌లో తోట చంద్రశేఖర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీఆర్‌ఎస్ నిలవబోతుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పలువురు కాపు నాయకులు, మద్దతుదారులతో హోటల్ షెల్టన్‌లో ఆయన సమావేశం అయ్యారు. కేసీఆర్ ఒక్కరే మోదీను ఎదుర్కోగలరని, ఏపీ ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అయ్యిందని విమర్శించారు. కేంద్రం మెడలు వంచాలంటే అది బీఆర్‌ఎస్ వల్లనే అవుతుందని, ఏపీలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి వస్తామని అన్నారు. పోలవరం గురంచి ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మాత్రమే కేంద్రం మెడలు వంచి పోలవరం పూర్తిచేయగలదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు. ఆ తరువాత ఆయన దొమ్మేరులోని రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విశాఖ స్టీల్‌ఫ్లాంట్‌ను అమ్మేయలని చూస్తోంది
‘‘విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం 26,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు వరకు అంటే 50 ఏళ్లు అవుతుంటే కేవలం 8,000 మంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు. మా సమస్యలపై పోరాటం చేసే గట్టినాయకుడు లేకపోవడం వల్లనే మాకు ఉద్యోగాలు రాలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునే నాయకుడు లేకపోయాడు. రూ.3 లక్షల కోట్లకు అమ్మేందుకు ప్రయత్నిన్నారు. ప్రయివేటీకరణను అడ్డుకోకపోతే కార్మికులంతా రోడ్డుపై పడతారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ కుట్ర పన్నుతోంది’’ అని తోట చంద్రశేఖర్ అన్నారు.
రంగా హత్య కేసును రీ ఓపెన్ చేయాలి..
వంగవీటి రంగా పేరును ప్రతి పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తోందని బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఆయనమీద ప్రేమ ఉన్నా లేకున్నా ఆయన ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నారు.. అందుకే అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు.. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఎవ్వరో అందరికీ తెలుసు.. ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తుంటే నిర్వాసితులకు ప్లాట్లు ఇవ్వాలని, పేద ప్రజల పక్షాన ఆయన నిరాహారదీక్షకు కూర్చున్నారు.. రంగా ఆయన స్వార్దం కోసం నిరాహార దీక్షలో కూర్చోలేదన్నారు. రంగాను ఎవ్వరు హత్య చేయించారన్నది అందరికీ తెలుసు.. కానీ నేటికీ రంగాను హత్య చేసిన దోషులకు శిక్ష పడలేదు. హత్య చేసిన కుట్రదారులు ఎవ్వరు అనేది తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆనాడు ఎందుకు హైకోర్టులో అప్పీలు చేయలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఎందుకు సవాలు చేయలేదన్నారు. ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. మూడున్నర దశాబ్దాల అవుతోంది.. అవుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ హఋదయాల్లో నిలిచిపోయారు.. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక గొప్ప కార్యక్రమాలు చేశారు. అందుకే 35 ఏళ్లు అవుతున్నా ఆయన చిరస్మరణీయునిగా నిలిచిపోయారని చంద్రశేఖర్ అన్నారు.