AP BJP Vishnu : అభివృద్ధి చేశామని ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా ? ఏపీ సర్కార్‌కు బీజేపీ సవాల్ !
అభివృద్ధి చేశామని చెప్పి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని వైసీపీని బీజేపీ ప్రశ్నించింది. జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని ఆ పార్టీ స్పష్టం చేసింది.
AP BJP Vishnu : మూడున్నరేళ్లులో ఒక్క అభివృద్ది పనులు చేశామని ఎలక్షన్ కి వెళ్లగలిగే దైర్యం ఉందా.. ఏపీ ప్రభుత్వానికి బీజేపీ సవాల్ విసిరింది. ప్రభుత్వం ప్రభుత్వంమీద ఫిర్యాదు చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా చార్జ్ షీట్స్ ను వేసి ప్రజలముందు ఉంచుతామని ప్రకటించారు. 2024 లో ఏపీ రాజకీయ భవిష్యత్ నిర్ణయించే సమావేశం మంగళవారం భీమవరంలో జరిగిందన్నారు. జగన్ అమరావతిని ముంచేశారని.. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. భావి తరాలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా..? అని ప్రశ్నించారు.
ఐదేళ్లు ఏపీని చంద్రబాబు సగం నాశనం చేశారు.. ఇప్పుడు వైసీపీ మిగతా సగం నాశనం చేస్తోంది !
ఐదేళ్లు ఏపిని చంద్రబాబు సగం సర్వనాశనం చేశారని.. 2000 కోట్లు ఇస్తే కనీసం అసెంబ్లీ కూడా కట్టలేకపోయారన్నారు. చంద్రబాబు అసమర్ద నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. మా పార్టీతో కలిస్తే రాష్ట్రం రక్షింపబడుతుంది అని కొంత మంది చెబుతున్నారని... టీడీపితో , వైసిపితో కలిస్తే రాష్ట్రాన్ని భక్షింపబడుతుందిగాని రక్షింపబడదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనైతికంగా బీజేపీ కి చెందిన ఎవర్నైనా వేరే పార్టీలో చేర్చుకుంటామంటే అగ్గితో తల గోక్కున్నట్టేనని హెచ్చరించారు. ఉండవల్లులకు , ఊసరవెల్లులకు ఇప్పుడే ,పోలవరం ,హోదా & కేంద్ర నిధులు గుర్తుకువస్తాయి మండిపడ్డారు.
అనైతికంగా బీజేపీ నేతల్ని చేర్చుకుంటే నిప్పుతో తల గోక్కున్నట్లే !
పక్క రాష్ట్రంలో ఒకరికి కేసులు, ఒకరికి ఆస్తులు ఉన్న మీరు కేసీఆర్ కే భయపడుతున్నారు మీరు బీజేపిని ఏం బెదిరిస్తారని ప్రశఅనించారు. వచ్చే ఎన్నికల్లో రెండు కుటుంబ పార్టీల్లో ఒక కుటుంబ జెండా పీకేయడం ఖాయమన్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్దిగా ఎవర్ని పెట్టుకోవాలో మాకు తెలీదా..? మా బ్రాండ్ అంబాసిడర్ మోది మాత్రమే ఆయన ఫోటోతోనే ఎన్నికలకు వెళతామని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారుతున్నారని ఎవరికైనా చెప్పారా అని ప్రశ్నించారు. జీవో 1 తీసుకురావడానికి ప్రధాన కారణం టీడీపీనేనని సభలు పెట్టి ఎంతోమంది ప్రాణాలు పోతే కనీసం ప్రచారం ఆపలేదన్నారు. మరణాలపై కుట్ర ఉందన్నారు కాని టీడిపి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.
జనసేనతో కలిసే బీజేపీ పోటీ -పొత్తు ఎవరూ చెడగొట్టలేరన్న బీజేపీ
పొత్తులపై బీజేపీ-జనసేన పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉందని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కల్యాణే క్లియర్ గా చెప్పారన్నారు. బీజేపీ ,జనసేన కలిసే ఎన్నికలకు వెళుతున్నామని.. మా ఇద్దరి కలయికలను చెడగొట్టడానికి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసే ఉన్నామని తెలంగాణలోని కొండగట్టులో ప్రకటించారు. అయితే ఆయన తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి అన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలోనూ కలిసే ఉన్నామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ బీజేపీకి దూరంగా ఉంటామని ఎప్పుడూ జనసేన చెప్పలేదు.