Bjp On CM Jagan Photo : జగన్ పోస్టర్ పై బీజేపీ అభ్యంతరం, శివాలయాల వద్ద నిరసన
సీఎం జగన్ బాల శివుడికి పాలు తాగిస్తున్నట్లు అధికార వైసీపీ పార్టీ ప్రచారం చేయడం హిందూ ధర్మాన్ని కించపరచడమే అవుతుందని నెల్లూరు మూలపేట శివాలయం వద్ద బీజేపీ నేతలు నిరసన చేశారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వైసీపీ వేసిన ఓ పోస్టర్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరులో కూడా బీజేపీ నాయకులు బ్యానర్లతో ఆందోళన చేపట్టారు.
ఆదిదేవుడు శివుడుని బాలునిగా చిత్రీకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ శివుడికి పాలు తాగిస్తున్నట్లు అధికార వైసీపీ పార్టీ ప్రచారం చేయడం హిందూ ధర్మాన్ని కించపరచడమే అవుతుందని నెల్లూరు మూలపేట శివాలయం వద్ద బీజేపీ నేతలునిరసన తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైశాచిక పాలనకు నిదర్శనంగా వైసిపి పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని అన్నారు. జగన్ సర్కార్ కు హిందువుల పట్ల చులకన భావం ఉన్నట్లు శివరాత్రి సందర్భంగా ప్రచారం చేసిన ఈ కార్టూన్ స్పష్టం చేస్తుందని విమర్శించారు. వైసీపీ తప్పు తెలుసుకుని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నమామిగంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, వీర రాఘవులు, గంగుల జనార్ధన్ యాదవ్, డాక్టర్ సుప్రియ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
క్షమాపణకు డిమాండ్..
శివరాత్రి సందర్భంగా వేసిన పోస్టర్ ని వెంటనే సోషల్ మీడియానుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల వద్ద నిరసనలు తెలియజేస్తామని చెప్పింది. వైసీపీ దీన్ని లైట్ తీసుకోవడంతో బీజేపీ నేతలునిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నెల్లూరులో కూడా ఆందోళనలు జరిగాయి.
సోషల్ మీడియాలో ట్రోలింగ్..
మరోవైపు వైసీపీ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం బాల శివుడు అంటూ ఆందోళనలు చేపట్టడం విశేషం. వైసీపీ పోస్టర్ లో కేవలం ఓ బాలికకు జగన్ పాలు పడుతున్నట్టుగా ఉంది. శివరాత్రి సందర్భంగా ఇలా పాలుపట్టే పోస్టర్ పెట్టడాన్ని కొంతమంది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. శివారాధనలో అభిషేకాలు ముఖ్యం. అందులోనూ శివరాత్రి సందర్భంగా శివుడికి పాలాభిషేకాలు చేస్తుంటారు. పాలాభిషేకాలు చేయొద్దనే ఉద్దేశంతోనే ఇలా పిల్లలకు జగన్ పాలు పడుతున్న పోస్టర్ ని ట్విట్టర్లో ఉంచారా అంటూ ఆ ట్వీట్ కి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. జే బ్రాండ్ మద్యాన్ని జగన్ యువతకు పడుతున్నట్టుగా మరికొంతమంది సెటైరిక్ గా పోస్టర్లు వేశారు. సహజంగా నాయకులు పండగలకి, ఇతర సందర్భాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తుంటారు. కానీ ఈసారి వైసీపీ కాస్త వెరైటీగా జగన్ శుభాకాంక్షలు చెబుతున్నట్టుగా పోస్టర్ వేసింది. అందులో సీఎం జగన్ ఓ బాలికకు పాలు పడుతున్నట్టుగా ఉన్న పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ వివాదానికి కారణం అయింది. ఇప్పటికింకా పోస్టర్ విషయంలో వైసీపీకి వెనక్కి తగ్గేలా లేదు. పోస్టర్ పై వైసీపీనుంచి ఎలాంటి వివరణ లేదు. బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది.
కన్నా రాజీనామా తర్వాత బీజేపీ ఏపీలో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే ఇలా వైసీపీ పోస్టర్ ని వివాదం చేస్తోందనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. అయితే బీజేపీ నేతలు ఇవేవీ పట్టించుకోవడంలేదు.