BJP Vishnu : పర్మినెంట్ చేయకపోతే వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడాలి - ఏపీ బీజేపీ పిలుపు
వలంటీర్లను పర్మినెంట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
BJP Vishnu : వాలంటీర్ల విషయంలో ఏపీ బీజేపీ తన విధానాన్ని స్పష్టం చేసింది. వాలంటీర్లపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న వైఎస్ఆర్‌సీపీ నిజాయితీ ఉంటే తక్షణం ఆ వ్యవస్థ ను.. వాలంటీర్లను పర్మినెంట్ చేయాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఎక్కడలేని ప్రేమను ఒలక బోయడం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి పలు కీలక అంశాలపై స్పందించారు.
గ్రామ పంచాయతీ నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి : విష్ణువర్ధన్ రెడ్డి
పరిపాలించమని ప్రజలు ఆధికారం ఇస్తే.. వారి దగ్గరున్న అధికారాలన్ని లాగేసుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఖచ్చితంగా ప్రజాద్రోహమేనని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న ధోరణిని చూస్తే బాధేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సర్పంచులు , ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీ హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో సర్పంచుల కోట్ల నిధులను దారి మళ్ళించిన సంగతి ప్రజలు చూస్తూనే వున్నారని.. పర్మినెంట్ సీఎం అనే భ్రమలో ఉన్నారేమో కానీ.. ప్రజలు ఐదేళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చిన తాత్కలిక ముఖ్యమంత్రి అనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు , ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పర్మినెంట్ ... మరో 9 నెలలలో మిమ్మల్ని ప్రజలు సాగనంపుతారని గుర్తుంచుకోవాలన్నారు. రూ. 7650 కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి ఏమి చేశారో శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందా ? దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కోరితే ఇంతవరకు స్పందన లేదని మండిపడ్డారు.
అమరావతిలో పేదల ఇళ్ల పేరుతో చేస్తున్నది పచ్చి మోసం !
రాజధాని అమరావతి లో పేదలకు 50 వేల ఇళ్ళు ఇవ్వాలని కొత్త తరహా మోసానికి తెరలేపారన్నది నిజమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులు , వారి హక్కులను గుర్తించని మీ ప్రభుత్వం వారి భూములను ఉపయోగించుకోనే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ నుంచి వస్తుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో ఇప్పట్టివరకు ఇళ్లను పూర్తి చేయలేని ముఖ్యమంత్రి పేదలకు 50వేల ఇళ్లను ఇస్తామంటే పేదలు నమ్ముతారా ?. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కి అమరావతిలో ఉండాలంటే 30 వేల ఎకరాలు అమరావతికి భూములిచ్చిన రైతుల హక్కులను నెరవేర్చి మాత్రమే అక్కడ పేదలకు ఇళ్ళు కట్టాలన్నారు.
పురందేశ్వరి జోనల్ సమావేశాలకు మంచి స్పందన
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి నేతృత్వంలో నిర్వహిస్తున్న జోనల్ సమావేశాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ జోన్ సమావేశం విజయవంతం అయింది. రాయలసీమ డిక్లరేషన్ విషయంలో బీజేపీ విధానం స్పష్టంగా ఉంది. మంగళవారం కోస్తా జోన్ సమావేశంలో పురందేశ్వరి పాల్గొంటారు. కోస్తా జోన్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ సమావశంలో పాల్గొంటారు. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి.. ప్రభుత్వంపై ఎలా పోరాడాలన్నది ఖరారు చేసుకుంటామని విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు.