Janasena: ధియేటర్ల ఇష్యూలో రాజమండ్రి జనసేన ఇంచార్జ్ పై వేటు - కీలక నిర్ణయం తీసుకున్న జనసేనాని
Atthi Satyanarayana: రాజమండ్రి జనసేన ఇంచార్జ్ అత్తి సత్యనారాయణను పదవి నుంచి తొలగించారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.

Atthi Satyanarayana expelled from Jana Sena party: ధియేటర్ల బంద్ విషయంలో జనసేన పార్టీ నేతలు ఉన్నా సరే ఉపేక్షించవద్దని చీఫ్ పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ క్రమంలో ధియేటర్ల బంద్ కు మొదట ప్రతిపాదించిన వ్యక్తి జనసేన పార్టీ నేత అత్తి సత్యనాారాయణ అనే పేరు బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్‌లో మొదటగా రాజమండ్రి జనసేన ఇంచార్జ్, ఎగ్జిబిటర్ అయిన అత్తి సత్యనారాయణ ధియేటర్లను బంద్ చేయాలన్న విషయాన్ని ప్రస్తావించారని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. అయితే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
శ్రీ అత్తి సత్యనారాయణ మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది. pic.twitter.com/zSsXAwPLQM
— JanaSena Party (@JanaSenaParty) May 27, 2025
అత్తి సత్యనారాయణ అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. అలాగే పలు ధియేటర్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమావేశంలో ఆయన ధియేటర్ల బంద్ ప్రస్తావన తెచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం వైసీపీకి చెందిన మరో నేత ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆయనకూ ధియేటర్లు ఉన్నాయి. ఆయన ప్రోద్భలంతోనే అత్తి సత్యనారాయణ ప్రతిపాదన తెచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ధియేటర్ల బంద్ కుట్ర చేసిన వారు సొంత పార్టీ నేతలు అయినా క్షమించకూడదని పవన్ చెప్పడంతో అత్తి సత్యనారాయణకు గడ్డు పరిస్థితి ఎదురయింది.
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ కల్యాణ్ అంతకు ముందు ప్రభుత్వ శాఖలకు సూచించారు. సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఇందులో బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.





















