Shivaratri Special Buses : శివభక్తులకు ఏపీ,టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్- శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
Shivaratri Special Buses : తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.
Shivaratri Special Buses :మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ 3800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్ల ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కల్గిన డ్రైవర్లతో బస్సుల నడపనున్నట్లు వెల్లడించింది. కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలం క్షేత్రానికి 650 బస్సులు, పొలతలకు 200 బస్సులు, పట్టి సీమకు 100 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు, బస్సులు సిద్ధం చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుస్తాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
భగవంతుడిని భక్తులని మరింత చేరువ చెయ్యాలి అనే ఉద్దేశంతో శ్రీశైలం వెళ్లే అన్ని APSRTC బస్సు సర్వీసులకు ప్రయాణ టిక్కెట్లుతో పాటు శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జునస్వామి వారి ఆలయ స్పర్శదర్శనం,అతిశీఘ్రదర్శనం, శీఘ్రదర్శనం టిక్కెట్లు కూడా ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది pic.twitter.com/4FGbtw96hv
— APSRTC (@apsrtc) February 12, 2023
శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక ప్యాకేజీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు 1075 స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన టికెట్లు అందుబాటులో ఉంచింది. ఈ మేరకు దేవాదాయశాఖతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్ టికెట్లతో పాటు దర్శన టికెట్లు ఇస్తామని వెల్లడించారు. ఆర్టీసీ పోర్టల్ ద్వారా ప్రయాణానికి 15 రోజులు ముందుగా దర్శన టికెట్లు జారీచేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా టికెట్ బుక్ కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల కోసం రోజుకు 1075 దర్శన టికెట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ టికెట్లలో నిత్యం 275 స్పర్శ, 300 అతి శీఘ్ర, 500 శీఘ్ర దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. స్పర్శ దర్శన టికెట్ రూ.500, అతిశీఘ్ర దర్శన టికెట్ రూ. 300, శీఘ్ర దర్శన టికెట్ రూ. 150ల చొప్పున ముందస్తు రిజర్వేషన్‌తో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ కూడా
తెలంగాణ ఆర్టీసీ కూడా శివరాత్రి సందర్భంగా 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 2437 బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ తెలిపింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, వేలాలకు 108, కాళేశ్వరానికి 71, కొమురవెల్లికి 52, రామప్పకు 16 ప్రత్యేక బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల్లో ఏపీలోని ఏడుపాయలకు 497 బస్సులు, వేలాలకు 108 బస్సులు, కాళేశ్వరానికి 51 బస్సులు, కొమురవెల్లికి 52 బస్సులు, కొండగట్టుకు 37 బస్సులు, అలంపూర్‌కు 16 బస్సులు, రామప్పకు 15 బస్సులు, ఉమా మహేశ్వరానికి 14 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.