Breaking News Live: మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 9న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబాదేవి శుక్రవారం భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై బ్రహ్మచారిణి అమ్మవారిని ఆలయ సిబ్బంది విశేష పుష్పాలంకరణలతో కొలువుదీర్చారు
మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. కారు నడిపిన వ్యక్తి విద్యుత్ శాఖ డీఈ నరేందర్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదం అనంతరం పీఎస్‌కు వెళ్లి నరేందర్ రెడ్డి లొంగిపోయారు.
నెల్లూరు-ముంబై హైవేపై మరో ప్రమాదం..
నెల్లూరు-ముంబై హైవేపై ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు బోర్డు వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడు అనంతసాగరం మండలం మంగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.





















