Breaking News Live Telugu Updates: నేడు టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు, ఎమ్మార్వోలను కలవనున్న నేతలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్ష సూచనలు ఏమీ లేవు. చాలా వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు దాని పరసర ప్రాంతాలు, పశ్చిమ విదర్బ, తెలంగాణ, రాయలసీమలపై కొనసాగుతూ సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలు, తమిళనాడు అంతర్భాగంలో సుముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, దక్షిణ వైపు వంగి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పైకి వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమురం భీం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికార వెబ్ సైట్ లో వెల్లడించారు.
హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో అంతంతమాత్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అయితే భారీ వర్ష సూచన లేదు. తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
Gold-Silver Price 1 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (బుధవారం) పోలిస్తే నేడు (గురువారం) బాగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ₹ 360 దిగొచ్చింది.
తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (గురువారం) ₹ 250 తగ్గి ₹ 47,000 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా ₹ 270 తగ్గి ₹ 51,270 గా ఉంది. కిలో స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 100 తగ్గి ₹ 60,000 కు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (గురువారం) ₹ 250 తగ్గి ₹ 47,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కూడా ₹ 270 తగ్గి ₹ 51,270 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 100 తగ్గి ₹ 60,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,270 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్, విజయవాడ తరహాలోనే కిలో ₹ 60,000 గా ఉంది.
Kadapa: కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యాయ సంఘాల ఆందోళన
ఉద్యోగికి సామాజిక భద్రత లేని సీపీఎస్ ను తక్షణం రద్దు చేయాలంటూ కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్బంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాకా కాలయాపన చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. తక్షణం సిపిఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అర్హులైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వీటి పరిష్కారం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్దమని హెచ్చరించారు.
MLA Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ కు నిరసనగా బోధన్ బంద్
నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్ ప్రశాంతంగా నడుస్తోంది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్ లో పెట్టడాన్ని నిరసిస్తూ బోధన్ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద బంద్ పాటించాలని కరపత్రాల పంపిణీ చేశారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బోధన్ బంద్ పిలుపుతో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. హిందూ సంఘాలు మునవార్ ఫారుకి కామెడీ షోని 16 రాష్ట్రాలు నిషేధిస్తే తెలంగాణ సర్కారు మాత్రం పోలీసు బందోబస్తు మధ్య షో ని నడిపిందని శివసేన జిల్లా అధ్యక్షుడు గోపీ కిషన్ ఎద్దేవాచేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మునావర్ ఫారూఖి షోపై కామెంట్ చేస్తే అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్ పాలుచేశారని అన్నారు. భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టడాన్ని నిరసిస్తూ బోధన్ బంద్ కు సహకరిస్తున్న ప్రతిఒకరికి ధన్యవాదాలు తెలిపారు.
Finger Prints Scam: హైదరాబాద్ కొత్త రకం మోసం వెలుగులోకి
ఎప్పుడూ చూడని కొత్త తరహా మోసం హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకొనేవారినే లక్ష్యంగా చేసుకొని నిందితులు రెచ్చిపోయారు. గల్ఫ్ దేశాలు వెళ్లడానికి వేలి ముద్రలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఒకసారి గల్ఫ్ వెళ్లే ప్రయత్నంలో రిజెక్ట్ అయిన వారు కొత్త దారులు వెతికారు. వేలిముద్రలకు ఆపరేషన్ చేసుకొని మళ్లీ వెళ్లడానికి యువకులు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని అదనుగా చేసుకుని ఓ ముఠా కొత్త రకం మోసాలకు పాల్పడింది. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండే విధంగా ఓ డాక్టర్, తన సిబ్బందితో సర్జరీలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
సర్జరీ తర్వాత దొడ్డి దారిన గల్ఫ్ దేశాలకు యువకులు వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ కొత్త రకం మోసంపై ఇంకా అన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Nalgonda: నల్గొండ జిల్లాలో రియాక్టర్ పేలిన ఘటనలో ఒకరి మరణం
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు హిందీస్ కంపెనీలో గత నెల 24న జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఒకరు చనిపోయారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జార్ఖండ్‌కు చెందిన బల్దేవ్ అనే కార్మికుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కార్మికులు కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. గత నెల కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డ విషయం తెలిసిందే.
Tirumala News: తిరుమల బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలివచ్చే అవకాశం ఉందని, గరుడసేవ నాడు 5 నుంచి 6 లక్షలు మంది భక్తులు వాహనసేవను చూసేందుకు వస్తారని సమాచారం ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాలు ఏర్పాట్లపై టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులతో కలిసి మాడ విధుల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మాడ వీధుల్లో కేవలం 1.9 లక్షలు మంది భక్తులు మాత్రమే ఉత్సవాలను వీక్షించే అవకాశం ఉందని, రెండేళ్ల అనంతరం ఉత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తూ ఉండడంతో ఈ సారి అంతకంటే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులు కచ్చితంగా పోలీసుల సూచనలను పాటించాలన్నారు. తీవ్రవాదుల కదలికల ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.