AP Students: అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించిన ఏపీ విద్యార్థులు - నేటితో ముగిసిన యూఎస్ఏ పర్యటన
AP Students: ఎస్డీజీ సదస్సు కోసం అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించారు. లోపలికి వెళ్లి మరీ అన్ని ప్రదేశాలను చూశారు.
AP Students: ఐక్యరాజ్య సమితి వేదికగా న్యూయార్క్‌లో జరిగిన ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో.. ఏపీకి చెందిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరంతా బుధవారం రోజు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను సందర్శించారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతిని ఇచ్చే ఆ దేశ అధికారులు.. తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపలి ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు. అంతేకాకుండా దగ్గరుండి మరీ పిల్లలను శ్వేత సౌధం అంతా తిప్పారు. భవనంలోని ప్రతీ విభాగం, పని విధానాన్ని అర్థం అయ్యేలా వివరించారు. విద్యార్థులు కూడా చాలా ఆసక్తిగా భవనంలోని అన్ని విభాగాలను చూశారు. అక్కడి విభాగాలు, సిబ్బంది పనితీరు, సెక్యూరిటీ సిస్టం, అధ్యక్షుడు నివసించే భవనం, కార్యాలయం పని విధానాలను తెలుసుకున్నారు. ఈరోజుతో ఏపీ సర్కారు బడుల విద్యార్థుల అమెరికా పర్యటన పూర్తి అయింది. రేపో, ఎల్లుండో విద్యార్థులు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు.
సర్కారు బడుల విద్యార్థులను అంబాసిడర్లుగా చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో అమలు చేస్తు్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు ఏపీ సర్కారు బడుల్లో చదువుతున్న పది మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లబ్ధిపొందిన వారే చెప్పడం సమంజసం అని భావించిన ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇలా దేశ చరిత్రలో తొలిసారి సర్కారు పాఠశాలల విద్యార్థులు మన రాష్ట్రం నుంచే ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి. శ్రీనివాస రావు నేతృత్వంలో యునైటెడ్ నేషన్స్ లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్న షకిన్ కుమార్ సనవ్యయంతో ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పర్యవేక్షణలో విద్యార్థుల బృందం ఈనెల 14వ తేదీన అమెరికాకు వెళ్లింది.
ఎస్డీజీ సదస్సులో గళం వినిపించిన ఏపీ విద్యార్థులు
అయితే సెప్టెంబర్ 16వ తేదీ రోజు జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ఏపీ విద్యార్థులు తమ గళం వినిపించారు. తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరం అని అన్నారు. అభివృద్ధికి యువత టార్చ్ బేరర్ గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. అయితే యూఎన్ఓ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన తీసుకొస్తున్న అద్భుతమైన పథకాల వల్లే సర్కారు బడిలో చదివే పిల్లలకు యూఎన్ఓ సదస్సులో స్థానం దక్కిందని అంటున్నారు.