AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో 3 రోజులపాటు ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల వార్నింగ్
Andhra Pradesh Weather News | బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

AP Rains Latest News | అమరావతి: ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా తెలిపింది. ఇదివరకే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో నేడు అల్పపీడనంగా మారనుంది. మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి, ఆపై తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
నేటి నుంచి ఈ జిల్లాల్లో వర్షాలు.. పిడుగుల వార్నింగ్
నేడు (అక్టోబర్ 21న) పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 22వ తేదీన బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 48 గంటల్లో దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 20, 2025
మత్స్యకారులకు హెచ్చరిక
వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని, రెండు రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లడం అంతా మంచిది కాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రికి దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ 23న కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






















