TDP leader Nara Lokesh: పోలీసుల అదుపులో నారా లోకేశ్... నరసరావుపేట పర్యటన టెన్షన్ టెన్షన్... ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అరెస్టు
నారా లోకేశ్ గుంటూరు జిల్లా పర్యటన టెన్షన్ టెన్షన్ గా సాగుతోంది. గన్నవరం ఎయిర్ పోర్టులో లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ లోకేశ్ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నాక పోలీస్ వ్యాన్ నుంచే లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో పోలీసులు, లోకేశ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు, నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
పర్యటన ఎందుకు?
ఈ ఏడాది ఫిబ్రవరి 24న ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూషను ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోకేశ్ నరసరావుపేట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నరసరావుపేట పర్యటన కోసం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేశ్ వచ్చారు. అయితే పర్యటనకు అనుమతి లేదని లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. పోలీసుల తీరుపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోకేశ్ పర్యటనకు అనుమతి లేదు
నారా లోకేశ్ నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. ఫిబ్రవరి 24న అనూష హత్య జరిగితే 24 గంటల్లో నిందితుడని అరెస్ట్ చేశామని తెలిపారు. అనూష కుటుంబానికి కూడా ప్రభుత్వ పరిహారం అందజేసిందని గుర్తుచేశారు. కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. కేసు ట్రైల్ కు కూడా వచ్చిందని ఎస్పీ తెలిపారు. రాజకీయాల కోసం నరసరావుపేట రావడం సరికాదని ఎస్పీ అన్నారు. పాత కేసులతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. అనూష కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడని కోరారు. ఇటీవల గుంటూరులో హత్యకు గురైనా రమ్య మృతదేహాన్ని ఇంటికి కూడా తీసుకెళ్లకుండా అడ్డుకోని గందరగోళం సృష్టించారని ఎస్పీ అన్నారు. అనూష హత్య జరిగినప్పుడు ఆ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆరు గంటల పాటు అలజడి సృష్టించారన్నారు. కోవిడ్ నేపథ్యంలో నారా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
Also Read: JSP For Roads: అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కామెంట్స్