Andhra Special Tax : ఏపీలో పన్నులు కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? సినిమాల్లో మాత్రమే అలాంటివి చూస్తారు - ఇవిగో అసలు సీన్లు
పన్నుల వసూళ్లు పేరుతో విపరీత చర్యలకు ఏపీ అధికారులు పాల్పడుతున్నారు. కొళాయిలు కట్ చేయడం.. మనుషుల్ని ఇంట్లో ఉంచి సీజ్ చేయడం వంటివి చేస్తున్నారు. వీరు చేస్తున్న పనిని మంత్రి బొత్స సమర్థిస్తున్నారు.
ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు పన్నుల వసూళ్లకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా పన్నులు కట్టకోపతే ఇంట్లోని వస్తువులను జప్తు చేస్తామనే హెచ్చరికలతో వాహనాలను తిప్పుతున్నారు. కొన్ని చోట్ల మంచి నీటి కనెక్షన్లను కట్ చేస్తున్నారు. అయితే తూ.గో జిల్లా పిఠాపురం అధికారులు మాత్రం మరింత దూకుడుగా ఉన్నారు. పన్నులు కట్టలేదని మనుషుల్ని ఇంట్లో ఉంచి.. తాళం వేసేసి.. ఆపైన సీల్ కూడా వేసి ముద్ర వేసేశారు. దీంతో రాజకీయ రచ్చ ప్రారంభమయింది.
పిఠాపురంలో మనుషుల్ని ఇంట్లో ఉంచి సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు !
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని 15వ వార్డులో ఇంటి పన్ను కట్టలేదని ఇళ్లకు తాళాలు వేశారు. లోపల మనుషులు కూడా ఉన్నారు. పన్నులు చెల్లించకపోతే నెలవారి వచ్చే పెన్షన్లలో కోత విధిస్తామని బాధితులను వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వేధిస్తున్నారని ఫించన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. ఈమొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మున్సిపాలిటీ రెవెన్యూ విభాగం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్ల సాయంతో ఇళ్ల పన్నుల వసూళ్లలో అధికారుల వ్యవహరిస్తున్న తీరుపై బాధితులు రోడ్డెక్కుతున్నారు .
టీడీపీ సానుభూతి పరుల పేరుతో ప్రజలపై పన్నుల వేధింపులు !
దీనిపై టిడిపి కౌన్సిలర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే వర్మ, 15వ వార్డులో బాధితులతో మాట్లాడారు. అధికారులు వ్యవహరించిన తీరును ప్రజలనడిగి తెలుసుకున్నారు. తమకు అసలు తాగునీరే రావడం లేదని, పన్నులు చెల్లించాలంటే , పెరిగిన పన్నులు చూసి భయం వేస్తోందని చెబుతున్నారు అక్కడ స్థానికులు . కేవలం తెలుగుదేశం కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లోనూ, తెలుగు దేశం జెండాలు కనిపించిన ప్రాంతాల్లో అక్కడ వైసీపీ నేతల ప్రోద్భలంతో ఇలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు.
అన్ని చోట్లా ఇలాగే పన్నుల వసూళ్లకు ప్రయత్నాలు !
రాజమండ్రిలో ఇంటి పన్నులు కట్టలేదని తాగునీటి అవసరాలకు వచ్చే రక్షిత పథకం కొళాయి కనెక్షన్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. దీంతో కనీస అవసరాలకు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. ఇదే తరహాలో కాకినాడ నగర పాలక సంస్థలో జప్తు వాహనాలు సిద్ధం చేసిన అధికారులు ఆ తర్వాత తప్పును సరిది కున్నారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జప్తు వాహనాలను బయటికి రాకుండా ఆపివేశారు. కర్నూలులో చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు దుకాణాల ముందు చెత్త కుప్పలు వేసి విమర్శలకు గురయ్యారు. తాజాగా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ పరిధిలోని దామోదరం సంజీవయ్య నగర్ లో కుళాయి కనెక్షన్లకు డిపాజిట్లు కట్టలేదనే నేపంతో నీటి సరఫరా చేసే కనెక్షన్లు తొలగించి, గొట్టాలకు బిరడాలు బిగించారు. దీంతో ఆ కాలనీలో మంచినీటి సరఫరా లేక నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఉచిత కనెక్షన్లు అని చెప్పిన ఆధికారులు ఇప్పుడు పన్నులు, డిపాజిట్లు కట్టలేదనే ఇలా చేయడం తగదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటున్న విపక్షాలు
ప్రజలను పీడిస్తున్న ఈ తరహా పన్నుల వసూలు తీరుపై విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇదేం తీరని ఆయన ప్రశ్నించారు.
తప్పేం లేదంటున్న బొత్స !
అయితే ప్రభుత్వం మాత్రం ఈ తరహా పన్నుల వసూలు తీరును సమర్థించుకుంటోంది. పన్నుల వసూళ్లలో అనధికారిక విధానాలను ప్రభుత్వం అవలంభించదని చెప్పారు. జప్తులు చేసే సంప్రదాయం మొదటి నుండి ఉందని ప్రకటించారు. పన్ను కట్టాలనే విషయం తెలియజేసేందుకే బ్యానర్ లను ప్రదర్శించటం జరుగుతుందన్నారు. గత గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు అడగలేదని మంత్రి బొత్స ప్రశ్నిస్తున్నారు.