Pawan Kalyan On New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, కీలక ప్రకటన విడుదల
Pawan Kalyan On New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు.
ఏపీలో నేడు మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాంతో నేటి నుంచి 26 జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ మేరకు ఇదివరకే జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌లను ఏపీ ప్రభుత్వం నియమించింది. నేటి ఉదయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు నేటి నుంచి అమలులోకి వచ్చాయని ప్రకటన చేశారు. వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రకటిస్తూ కొత్త జిల్లాల వివరాలు వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు.
ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం తమకు తోచినట్లుగా ముందుకు వెళ్లింది. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం.. అదే హేతుబద్ధత అని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల ఏర్పాటుతో వారు ఎదుర్కొనే దూరాభారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎటపాక, కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. సామాన్య, పేర గిరిజనులు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజుల సమయం పడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/EjsHgFcTdX
— JanaSena Party (@JanaSenaParty) April 4, 2022
ప్రజలను ఇబ్బంది పెట్టే తరహా విభజన వల్ల ప్రజలకు ఏ విధంగా పాలన దగ్గర చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ముంపు మండలాల వారికి ఇదే తరహా సమస్యలు వచ్చాయి. పునర్ వ్యవస్థీకరణ తరువాత కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఉండాలనే అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని.. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఉండాలని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.
ఆ బాధ్యత జనసేనదే..
ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదు. డ్రాఫ్ట్ ఇచ్చే ముందు చర్చలు జరగలేదు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో లోపాలు, అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుందన్నారు. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.