Visakhapatnam New District : రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా విశాఖ, పునర్వ్యవస్థీకరణతో పూర్తిగా మారిపోయిన స్వరూపం
Visakhapatnam New District : ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో విశాఖ స్వరూపమే మారిపోయింది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా మారిపోయింది విశాఖ. కొత్త జిల్లాలో అర్బన్ ప్రాంతాలు మాత్రమే మిగిలాయి.
Visakhapatnam New District : ఏపీలో జిల్లాల విభజనతో విశాఖ రూపం మారిపోయింది. అటవీ ప్రాంతం, సముద్ర తీరం, నదీ మైదానం, మెట్ట భూములు, కొండలు ఇలా అన్ని రకాల భౌగోళిక రూపాలతో ఉండే జిల్లాగా పేరొందిన విశాఖ ఇప్పుడు ఒక మరుగుజ్జు జిల్లా స్థాయికి పడిపోయింది. గతంలో చిన్న జిల్లాగా విజయనగరం ఉండగా ఆ స్థానం ఇప్పుడు విశాఖ జిల్లా పరమైంది.
గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా :
ఏపీలో కొత్తగా జిల్లాల విభజన జరిగాక విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 లక్షలు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేకపోవడం విశేషం. పాత విశాఖ జిల్లాను మూడు ముక్కలుగా విభజించాకా గ్రామీణ ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలోనికి, ఏజెన్సీ ప్రాంతాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనికి వెళ్లిపోయాయి. దానితో విశాఖ జిల్లాకు కేవలం అర్బన్ ప్రాంతాలు మాత్రమే దక్కాయి. దీనిలో భీమునిపట్నం, విశాఖ రెవెన్యూ డివిజన్లు కాగా 1)భీముని పట్నంలో 5 మండలాలు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్, సీతమ్మ ధార మండలాలు 2)విశాఖపట్నంలో గాజువాక, పెందుర్తి, మహరాణిపేట, ములగాడ, పెద గంటాడ, గోపాలపట్నం వంటి 6 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు 6కి పరిమితం కాగా అందులో విశాఖ నార్త్ , సౌత్ , ఈస్ట్ , వెస్ట్ , భీమిలి, గాజువాక సహా అన్నీ నగర పరిధిలోనే ఉండడం విశేషం. విశాఖ ఏపీ రాజధానుల్లో ఒకటిగా మారుతుందని ఆశపడ్డ జిల్లా ప్రజలకు ఇప్పుడు తమది రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లాగా మిగిలిపోవడం మింగుడుపడడం లేదు. జిల్లాల విభజన దెబ్బకు విశాఖ సిటీనే ఒక జిల్లాగా.. విశాఖ జిల్లా అంతా కలిపి ఒక సిటీ పరిధిగా మారిపోవడం జిల్లా ప్రజలకు అసంతృప్తినే మిగిల్చింది అంటున్నారు.
పర్యాటక ప్రాంతాలు లేని విశాఖ
విశాఖ అనగానే గుర్తొచ్చే అరకు, పాడేరు వంటి పర్యాటక ప్రాంతాలు, అటవీ అందాలు ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ అన్న పేరే విశాఖ జిల్లాకు దూరం అయ్యాయి. దాదాపు 60 లక్షల జనాభాతో పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు కేవలం 928 చదరపు కిలోమీటర్ల మేరకు కుచించుకుపోయింది.
విశాఖకు కొత్త సీపీ
విశాఖ కొత్త సీపీగా సీహెచ్. శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి 2019 వరకు ఆయన ఇక్కడ పనిచేశారు. విశాఖపై అవగాహన ఉందని సీహెచ్ శ్రీకాంత్ అన్నారు. ట్రాఫిక్, గంజాయి లాంటి వాటి నియంత్రణపై దృష్టి పెడతామన్నారు.