(Source: ECI | ABP NEWS)
Nara Lokesh New Look: ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు నారా లోకేష్ ఆహ్వానం
Nara Lokesh meets Australia India CEO | ఏపీ ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని, ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని నారా లోకేష్ కోరారు.

సిడ్నీ: ఆస్ట్రేలియా - ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కే తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు. 
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రాజెక్టుల్లో (ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో) భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈవోలకు ఏపీ ప్రత్యేకతలను తెలియజేయాలని అన్నారు. తదుపరి సీఈవోల ఫోరం సెషన్లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలని, ఆ సెషన్ లో ప్రాధాన్యత రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను ప్రదర్శిస్తామని చెప్పారు. ఫోరం వాణిజ్య, పెట్టుబడుల ఎజెండాలో “ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ – గేట్ వే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలన్నారు.

ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్టనర్ షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి హాజరుకావాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. 
ఈ సందర్భంగా మెక్ కే మాట్లాడుతూ ఆస్టేలియా, భారత్ దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి 2012లో ఇరుదేశాల ప్రధానమంత్రుల నేతృత్వంలో ఫోరంను ప్రారంభించినట్లు చెప్పారు. ఇరుదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు. ఇరుదేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, వలసలపై దృష్టిసారిస్తున్నామని అన్నారు. రెండు దేశాల మధ్య $48.4 బిలియన్ల వాణిజ్య భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు ద్వైపాక్షిక సహకారాన్ని పెంచడానికి విధానపరమైన మద్దతును అందిస్తున్నామని చెప్పారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సీఐఐతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు.






















