టీడీపీ హయాంలో కాపులపై కేసులు! జగన్ ప్రభుత్వం వాటిని కొట్టివేసిందన్న మంత్రి అంబటి
మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలుసుకోవడంలో జరిగే కుట్రలో కాపులు బలిపశువులు కావద్దని ఆయన హితవు పలికారు.
కాపులను నిరంతరం ద్వేషించే పార్టీ, తెలుగు దేశం పార్టీ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలుసుకోవడంలో జరిగే కుట్రలో కాపులు బలిపశువులు కావద్దని ఆయన హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీ కాపుల ద్వేషి...
తెలుగుదేశం అధికారంలో ఉండగా కాపులపై చాలా కేసులు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. తెలుగు దేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా కాపులను వేధించటం మామూలేనని అన్నారు. అందులో భాగంగానే రైలు దగ్దం కేసులో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజాపై కేసులు పెట్టించారని ఆరోపించారు. అయితే న్యాయస్థానం తుని రైలు దగ్దం కేసు విచారణ చేపట్టి, ఆధారాలు లేవని కొట్టి వేయటం హర్షించదగిన పరిణామమని మంత్రి అంబటి అన్నారు. నేరాన్ని ప్రూవ్ చేయలేకపోవటంతో రైలు దగ్దం కేసు కొట్టివేశారని తెలిపారు. రైలు దగ్దంలో ముద్రగడ, దాడిశెట్టి రాజాకు సంబంధం లేదన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు ప్రమేయంతోనే కాపులపై కేసులు పెట్టారని ఆరోపించారు. కేసు కొట్టివేయటం పై కాపులంతా హర్షిస్తుండగా, తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. రామోజీకి చాలా బాధగా ఉందని, అందుకే ఆయన పత్రికలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని ఆరోపించారు.
కాపులను ద్వేషించటం తెలుగు దేశం ఆనవాయితీ...
కాపులను వేధించటం,కేసులు పెట్టటం, తెలుగు దేశం పార్టీకి ఆనవాయితీ అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. కాపులంటే తెలుగుదేశంకు రాజకీయ కక్ష అని అన్నారు. టీడీపీ ఆవిర్బావం నుండి నేటి వరకు కాపుల ద్వేష పార్టీ అని చెప్పారు. వంగవీటి మోహన రంగాను టీడీపీ నేతలు హతమార్చారని, చంద్రబాబు ప్రోద్బలంతోనే వంగవీటి హత్య జరిగిందని ఆరోపించారు. అల్లర్లు జరిగితే ఆ తరువాత కాపులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు.
కేసులను తొలగించింది జగన్ ప్రభుత్వమే...
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా కాపులను వేధించి అక్రమంగా కేసులు పెట్టటం, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను విత్ డ్రా చేసుకోవటం షరామామూలు అయిపోయిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మర్రి చెన్నా రెడ్డి క్యాబినేట్ లో కాపులపై కేసులను తొలగించారని గుర్తు చేశారు. చెన్నా రెడ్డి హయాంలో తాను ఎమ్మెల్యేగా పని చేశానని , రంగా హత్య సమయంలో తాను న్యాయవాదిగా ఉంటే తనపైనే 11కేసులు పెట్టారని అంబటి అన్నారు. టీడీపీ కేసులు పెట్టటం, కాంగ్రెస్ కాపుల పై ఉన్న కేసులను తొలగించటం, అప్పుడు జరిగితే, ఇప్పుడు జగన్ కేసులను తొలగిస్తున్నారని,అయితే అప్పుడు,ఇప్పడు కాపులను వేదించేది మాత్రం తెలుగుదేశం మాత్రమేనని అన్నారు.
కాపుల విషయంలో చంద్రబాబు సైకో...
చంద్రబాబు కాపుల పట్ల సైకోలా వ్యవహరించారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చరిత్ర తెలియని వారు చంద్రబాబు తో పొత్తులు పెట్టుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. రంగా హత్య అప్పుడు ఏం జరిగిందో తెలియదు. కాపులకు రిజన్వేషన్ ఆందోళన సమయంలో ఇంట్లో కుర్చుకున్న పవన్ ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
చరిత్ర తెలియని అజ్ఞాని పవన్...
పవన్ కళ్యాణ్ చరిత్ర తెలియని అజ్ఞాని అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. కాపులతో చంద్రబాబు పల్లకి మోయించాలని చూస్తున్నారని విమర్శించారు. హింసకు గురయిన కాపులు మాత్రం పవన్ కలిసినా చంద్రబాబుతో కలవరని స్పష్టం చేశారు. కాపులను చంద్రబాబుకు అమ్మాలనే పవన్ ప్రయత్నాన్ని గమనించాలని కాపులకు పిలుపునిచ్చారు. జాతి వైరంతోనే చంద్రబాబు, రామోజీ కాపులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. పవన్ చంద్రబాబు కలయిక... చెల్లిపెళ్ళి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. ఎందుకు కలుస్తున్నారో అర్దం కావటం లేదని అయితే, క్యాష్ మార్పిడి జరుగుతుందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. పవన్,చంద్రబాబు చేసేవన్నీ చట్టవ్యతిరేక కలయికలు, అనైతిక కలయికలని, సామాన్యడి పై కుట్ర చేసే కలయికలుగా అభివర్ణించారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెడీ....
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెడీగా మాట్లాడతారంటూ అంబటి సెటైర్లు వేశారు. పోలవరం నిర్మిస్తే తెలంగాణ మునిగిపోతుందన్న మల్లారెడ్డి, అదే ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. జగన్ పోలవరాన్ని పూర్తి చేస్తారని.. కేసీఆర్, మల్లా రెడ్డి చేయాల్సిన అవసరం లేదన్నారు. నీటి విషయంలో మా వాటా మాకు ఇవ్వండని మంత్రి అంబటి కోరారు.