Andhra News: ఏపీలో తక్కువ ధరకే అన్ని రకాల మద్యం బ్రాండ్లు - మద్యం షాపుల కొత్త టైమింగ్స్ ఇవే!
Liquor Shops: ఏపీలో ఇక నుంచి తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
Liquor Shops New Timings In AP: నూతన మద్యం పాలసీకి (New Liquor Policy) ఏపీ కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపిన క్రమంలో తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి రానుంది. రూ.99లకే క్వాలిటీ మద్యం అందిస్తామని.. అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు. మద్యం షాపులకు లైసెన్సులు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. కొత్త షాపులకు దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్ అని ప్రభుత్వం తెలిపింది. లాటరీలో లైసెన్సులు దక్కించుకున్న వారు షాపు రన్ చేసుకునేందుకు రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకూ మందు షాపులు అందుబాటులో ఉండనున్నాయి.
వారికి 10 శాతం రిజర్వేషన్
అటు, గీత కులాలకు మద్యం షాపుల లైసెన్సుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లక్కీ డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు ఉండనుండగా.. యజమానికి 20 శాతం ప్రాఫిట్ ఉంటుంది. జనాభా ప్రకారం షాపుల సంఖ్యను నిర్ణయిస్తారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రీమియర్ లిక్కర్ షాపుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ షాపులకు రూ.కోటి ఫీజు కాగా.. రూ.15 లక్షలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌గా నిర్ణయించింది. తిరుపతిలో ప్రీమియం మద్యం దుకాణాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మద్యం పాలసీ సహా కీలక నిర్ణయాలు
కాగా, బుధవారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచాలని.. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
- భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. అలాగే, వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలకు ఆమోదం తెలిపింది.
- నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశం. వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు.
- చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలిలో తీర్మానించారు. దీనిపై మంత్రివర్గం కేంద్రానికి సిఫార్సు చేసింది.
- పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకి పనులు కేటాయించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏజెన్సీ బాధ్యత ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది.
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ 'స్టెమీ' పథకం ప్రారంభం. ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు జారీ
- రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌తో మాజీ సైనికోద్యోగుల కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. అటు, వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధుల విడుదలకు ఆమోదం.
- ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ కల్పించే దిశగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ స్కీం ఉపకరిస్తుంది.
Also Read: Chandrababu: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, జగన్ హయాంలో అన్నీ అరాచకాలే - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు