పుంగనూరు ఘటన: హోంమంత్రి ఎక్కడ! మాటలదాడిలో కనిపించని తానేటి వనిత - ఆఖర్లో ముక్తసరిగా స్పందన!
పుంగనూరు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రెకెత్తించింది. అధికార ప్రతిపక్ష పార్టీ, మధ్య భీకర యద్ధం జరిగింది. పోలీసులు సైతం కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇంతకీ హోం మంత్రి మాత్రం కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పుంగనూరు ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల మద్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. దీని పై పోలీసులు, పోలీసుల అధికారుల సంఘం కు చెందిన నాయకులు సైతం రియాక్ట్ అయ్యారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ సైతం ప్రెస్ మీట్ పెట్టి మరి, ఘటనపై కారణాలను గురించి వివరణ ఇచ్చారు. కేసులు నమోదు చేయటం, ఘటనకు కారకులయిన వారిపై చర్యలు తీసుకునే విషయాలపై డీఐజీ మీడియాతో మాట్లాడారు. అంతేకాదు విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారుల సంఘానికి చెందిన నాయకులు కూడా పుంగనూరు ఘటనలో తెలుగు దేశం పార్టీ వైఖరిని తప్పుబట్టారు.
అయితే ఇంత జరుగుతున్నా హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత మాత్రం, పుంగనూరు ఘటన విషయంలో జరిగిందేంటి అనే విషయాలపై మాట్లాడకపోటం చర్చకు దారితీసింది. అంతే కాదు సొంత పార్టీలో కూడా హోం మంత్రి తానేటి వనిత ఎక్కడ అంటూ క్వశ్చన్ లు కూడాా రెయిజ్ అయ్యాయంటే, ఆశ్చర్యం కలుగుతుంది. ఘటన జరిగిన తరువాత ముందుగా స్పందించాల్సిన హోం మంత్రి కూడా చాలా ఆలస్యంగా బదులు ఇచ్చారు. పోలీసులు, పోలీసు అధికారుల సంఘం నాయకులు అంతా గగ్గోలు పెట్టిన తరువాత చివర్లో హోం మంత్రి ప్రెస్ రిలీజ్ లో ఘటన పై స్పందించి, విచారణ చేపట్టి దోషులపై చర్యలు ఉంటాయని ముక్తాయింపు ఇచ్చారు.
పుంగనూరు ఘటన పై కలకలం
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ల యాత్ర పేరుతో రాయల సీమలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన పుంగనూరుకు చేరుకోగానే ఉద్రిక్త పరిస్దితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఎదురు రావటంతో, పోలీసులు అప్రమత్తం అయ్యి, చంద్రబాబు రూట్ మ్యప్ ను పుంగనూరు ఊళ్ళోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇదే సమయంలో తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు పాల్పడటం, అనేక మందికి గాయాలు అయ్యాయి. ఆఖరికి ఇరు పార్టీల నాయకులను చెదర కొట్టే సమయంలో, పోలీసులు సైతం గాయాలపాలయ్యారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే. శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు.
పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని ఆయన అన్నారు. కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలతో దాడి చేశారని, సుమారు 50 మంది పోలీసులను తీవ్ర గాయాలకు గురి అయ్యారని చెప్పారు. పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసం సృష్టించారని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డీజీపీకి విన్నవించారు.