AP Highcourt : ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు - కాలేజీలకు గుడ్ న్యూస్
engineering fees in AP : ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేసిన ప్రక్రియను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వంపై భారం తగ్గించుకోవడానికే ఈ ప్రక్రియ చేపట్టారని హైకోర్టు అభిప్రాయపడింది.
AP Highcourt on engineering fees : ఆంధ్రప్రదేశ్ లో (AP Government) ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేసిన ప్రక్రియను హైకోర్టు (AP HighCourt) తోసిపుచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలల ఖర్చులలో భాగంగా కమిషన్ విధించిన పరిమితులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే ఇలాంటి చట్ట వ్యతిరేక ప్రక్రియను చేసిందని న్యాయస్థానం పేర్కొంది. కమిషన్ చట్ట ప్రకారంగా తిరిగి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో అతి తక్కువ ఫీజులను సిఫారసు చేస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఇంజినీరింగ్ ఫీజులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ ఏడాది ఆగస్టు 2న విచారణ జరిగింది. న్యాయస్థానం ప్రతిపాదించిన ఫీజులపై తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఫీజులను ప్రభుత్వం సవరించింది.
మధ్యంతర త్తర్వుల్లో రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కళాశాలలు ఫీజులను మరో 10 శాతం పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, రుసుముల నియంత్రణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా ఒక్కటే ఫీజును అమలు చేస్తోంది. కనీస ఫీజు రూ.35వేలు ఉంటే గరిష్ఠంగా రూ.70వేలు ఇస్తోంది. ఎక్కువ కళాశాలలు రూ.35వేల జాబితాలోనే ఉన్నాయి. ఒక్క ఏడాదికి మాత్రమే ఈ ఫీజులను ఖరారు చేయగా ఆ తర్వాత వీటినే మూడేళ్లకు పొడిగించారు. ఈ గడువు 2022-23 విద్యా సంవత్సరంతో ముగిసింది. 2023-24కు కొత్త ఫీజులను అమలు చేయాల్సి ఉంది దీనిపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు చేస్తోంది. ప్రభుత్వపై భారం తగ్గించుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల్ని తగ్గించారని.. కమిషన్ ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక ఇచ్చిందని.. కాలేజీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పి.. కమిషన్ సిద్ధం చేసిన నివేదికను తోసి పుచ్చడంతో మరోసారి ఫీజులను ఖరారు చేయనున్నారు.