AP Highcourt : స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకు ఊరట - హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవే
Andhra News : స్కిల్ కేసులో అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
AP Skill Developement Case : టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు(ap skill development case)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిగింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. విచారణ ఏప్రిల్ 2 కి వాయిదా పడింది. అప్పటి వరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
అధికారుల్ని వదిలేసి రాజకీయ నేతలపై కేసులు పెట్టిన సీఐడీ అధికారులు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో నిందితుల జాబితా పెరుగుతూ పోయింది. టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)ను అరెస్టు చేసిన సీఐడీ (CID) విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అచ్చెన్నాయుడు హైకోర్టులో దాఖలు చేయగా.. ఆయనపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబు హయాంలో స్కిల్ సెంటర్ల ఏర్పాటు
2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లో.. యువత ఉపాధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిమెన్స్ ఇండియాతో ఎంఓయూ ఒప్పందాన్ని చేసుకుంది అప్పటి టిడిపి ప్రభుత్వం. ఇందులో 10 శాతం ఖర్చును ప్రభుత్వం పెట్టుకుంటే.. 90 శాతం ఖర్చు సీమెన్స్ గ్రాంట్ గా ఇవ్వాలన్నది ఒప్పందం సారాశం. 2015లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC)ను స్థాపించారు.రూ.3,356 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి 2021లో జరిగిన ఏపీ అసెంబ్లీలో పెద్ద స్కామ్ గా అభివర్ణించారు. 2021 డిసెంబర్ లోనే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు పంపారన్న ఆరోపణలున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత కీలక అంశంగా మారిన స్కిల్ కేసు
2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గంటా శ్రీనివాసరావును కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 20న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.