Andhra News :కృష్ణా విద్యుత్ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కీలక వాదనలు - తెలంగాణ ఏం చెప్పిందంటే ?
Andhra News : కృష్ణానదిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ జారీ చేసిన జీవో నెంబర్ 34పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Andhra News : కృష్ణా నదిపై ఉన్న జల విద్యుత్తు కేంద్రాల విషయంలో తెలంగాణ ప్రభుత్వమిచ్చిన జీఓ 34ను కొట్టేయాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ కోరుతోంది. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన ఇతర పిటిషన్లతో కలిపి వినాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది.. న్యాయమూర్తికి విన్నవించారు. కేసుల వివరాలు సమర్పిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నందున ఈ కేసు విచారణ తేదీని తొలుత నిర్ణయిస్తామని చెబుతూ తదుపరి విచారణను వచ్చేనెల 12కు వాయిదా వేశారు. ఆలోపు ఇరుపక్షాలవారు అదనపు డాక్యుమెంట్లు సమర్పించడానికి అంగీకరించారు.
తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో 100 శాతం ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 34 విడుదల చేసింది. మొదట ఈ జీవోపై రైతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించంది. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 34 తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది. సాగునీటికి ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వియోగిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అలా చేయడం ద్వారా నీరు వృథాగా సముద్రం పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.
తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోందని.. కృష్ణా జలాల పంపిణీ (Krishna Water Dispute) అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ ప్రజాలకు తీవ్ర నష్టం చేకూరుస్తోందని పిటిషన్‌లో తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు అమలు చేయడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిపై తదుపరి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం కీలకం కానుంది.
మరో వైపు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం అక్టోబరు 6న జారీ చేసిన విధివిధానాలపై కృష్ణా ట్రైబ్యునల్ బుధ, గురువారాల్లో విచారణ జరపనుంది. కేంద్రం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు ఈ నెల 29న విచారణకు రానున్నందున అంతవరకూ ట్రైబ్యునల్ విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం ఇదివరకు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దాంతో ఈనెల 22, 23వ తేదీల్లో కృష్ణా ట్రైబ్యునల్ విచారణ జరగనుంది.