East Godavari Tour: ఒక్క రోజులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు- పర్యాటక శాఖ అదిరిపోయే ఆఫర్
Andhra Pradesh News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను ఒకరోజులో దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేకమైన బస్‌లో తిప్పి తీసుకొస్తుంది.
East Godavari News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకురావాలనుకుంటున్నారా? మీ కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సరికొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను ఒక్కరోజులోనే దర్శించుకొని రావచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రతి శనివారం ఈ ప్రాంతాలను తిప్పి తీసుకొస్తుంది పర్యాటక శాఖ.
ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్రతీ శనివారం ఉంటుందని ఏపీ పర్యటక శాఖ మంత్రి దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు చెందిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు బస్సులు స్టార్ట్ అవుతాయి. మొత్తం తిరిగి రాత్రి 7.30కి టూర్ ముగుస్తుంది.
టికెట్ ధర పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు రూ. 800 ఉంటుంది.ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ సూచించారు.
టూర్ సాగేది ఇలా
రాజమండ్రిలో ఉదయం 6గంటలకు ప్రారంభం అయ్యే ఈ టూర్ మొదట అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రమైన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం చేరుకుంటుంది. అక్కడ నుంచి అన్నవరం వస్తుంది. అక్కడి రత్నగిరి కొండపై వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం చేరుకుంటుంది.
సామర్లకోటలో విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొంటారు. సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అత్యంత ప్రాచీన మహిమాన్విత శివ లింగ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత కోనసీమ తిరుపతిగా, ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా కీర్తి పొంది విశేషంగా ఆకట్టుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని చేరుకుంటారు.
అక్టోబర్ 26 నుంచి బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాత్రి 7గంటలకు రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్‌కు చేరుకుంటుందన్నారు. అక్కడే పవిత్ర గోదావరి నదికి కన్నుల పండువగా హారతి ఇచ్చే ప్రాంతంలో మంత్రముగ్ద దృశ్యాలను భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తారు. భక్తులు అధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలేలా కార్యక్రమం పూర్తైన అనంతరం 7.30గంటలకు తిరిగి రాజమహేంద్రవరంలోని ఏపీటీడీసీకి చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు భక్తులను చేరవేస్తారు.
బస్సుకు 18 మంది పర్యాటకులు
18 మంది సీటింగ్ సామర్థ్యంతో బయలుదేరే ఈ ప్రత్యేక బస్సుతో పాటు ఎవరైనా భక్తుల సమూహంగా కోరితే 18 మంది సమూహంతో ప్రయాణం ఏర్పాటు చేస్తారు. అధ్యాత్మిక భావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రాత్మిక ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే టూర్ ప్యాకేజీ ముఖ్యోద్దేశమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.