Govt on Chalo Vijayawada: ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులే... చర్చలతోనే సమస్యలు పరిష్కారం... చలో విజయవాడపై స్పందించిన మంత్రులు
ఉద్యోగులు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. చలో విజయవాడ సరైన చర్య కాదన్నారు.
పీఆర్సీ జీవోలు రద్దు, పాత జీతాలు ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. గురువారం ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగులను విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు, అరెస్టులు చేశారు. అయితే అన్ని అవరోధాలు దాటి చలో విజయవాడను విజయవంతం చేశామని ఉద్యోగ సంఘాలు ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తన నిరసన కొనసాగుతుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వేసింది. చర్చలు జరుపుతామని పదే పదే చెబుతున్నా.. జీవోలు రద్దుపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన చలో విజయవాడపై వైసీపీ ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఉద్యోగులు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం : హోంమంత్రి సుచరిత
చర్చలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం సరికాదని హోంమంత్రి అన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం కూడా కోరారన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కూడా వేశామన్నారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడా ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేయలేదన్నారు. అనుమతి లేని సభలకు వెళ్లవద్దని సూచించామన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయని ఆమె అన్నారు.
పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆలోచించాలి : మంత్రి ఆదిమూలపు సురేశ్
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావాలని ప్రభుత్వం కోరుతోందన్నారు. సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు గౌరవించాలని కోరారు. ఏదైనా సమస్యలుంటే వెంటనే చర్చలకు రావాలని కోరుతున్నామన్నారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉద్యోగులు సహకరించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చింది చీకటి జీవోలు కావన్న మంత్రి పగలు ఇచ్చినవే అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానంలో భాగంగా హెచ్ఆర్ఎ నిర్ణయించామన్నారు. లక్షల పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయులు ఆలోచించాలన్నారు. ఆందోళన విరమించి చర్చలకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.
ఉద్యోగులు మా కుటుంబ సభ్యులే...: ఎమ్మెల్యే జోగి రమేష్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల చలో విజయవాడ ర్యాలీపై ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. ఉద్యోగులకు ఎక్కడా అన్యాయం జరగనివ్వమన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడమే సరైన చర్య కాదన్న జోగి రమేష్.. ఉద్యోగులు కూడా మా కుటుంబ సభ్యులే ఎదన్నా అయితే అందరం బాధపడాలన్నారు. ఒమిక్రాన్ ఉన్న సమయంలో ఇలా చేస్తే కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. అధికారంలోకి రాగానే లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అడగకుండానే ఐఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. ఏదైనా సమస్య ఉంటే సబ్ కమిటీ ముందు మాట్లాడుకోవాలని సూచించారు.