Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త
Etikoppaka Kondapalli Toys | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తెల్ల పొనికి, అంకుడు మొక్కలను భారీగా నాటించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Pawan Kalayan Orders to Plantation of Ankudu And Tella Poniki Trees | ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పనులపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటితో బహుళ ప్రయోజనాలు ఉండేలా ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ ఓ సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది.
ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొనికి మొక్కలను పెద్దమొత్తంలో నాటించాలని నిర్ణయించింది. వీటిని ఎక్కడ పెంచాలనే అంశంపైన స్పష్టతనిచ్చిన ప్రభుత్వం అంకుడు మొక్కలను అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో నాటించాలని నిర్ణయించారు. తెల్ల పొనికి మొక్కల పెంపకానికి ఎన్టీఆర్ జిల్లా అనువైన ప్రాంతంగా నిర్ణయించారు.ప్రత్యేకంగా ఈ రెండు మొక్కల పెంపకంపైనే దృష్టిసారించటానికి కారణాలు ఉన్నాయి.
పవన్ నిర్ణయంలో అంత అర్థం ఉందా..
అంకుడు మొక్కలు చెట్లుగా మారిన తర్వాత వాటి కలపతో అనేక ఉపయోగాలు ఉంటాయి. చాలా మృదువుగా ఉండే అంకుడు కలపతోనే ప్రపంచ ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తారు. అంకుడు చెట్ల పువ్వులు, కాయలు, విత్తనాలు, ఆకులతో పశువుల దాణాను తయారు చేస్తారు. రంగుల తయారీలోనూ అంకుడును విరివిగా వినియోగిస్తారు. చింతపల్లి, పాడేరు, కంబాలపల్లి, అరకు, నర్సీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాల్లో అంకుడు మొక్కల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చాలా తేలిగ్గా వంగిపోయే, మృదువుగా ఉండే ఈ కలపతో ఏటికొప్పాక బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు బొమ్మల తయారీదారులు. ఆ కళను కాపాడేందుకు వారికి విరివిగా కలప అందుబాటులో ఉంచేందుకు ఈ అంకుడు మొక్కలను అల్లూరి సీతారామాజు, అనకాపల్లి జిల్లాల్లోని కమ్యూనిటీ క్లస్టర్లలో ఈ మొక్కలను ఉపాధి పనుల్లో భాగంగా నాటించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీ.ఆర్.కృష్ణతేజ మైలవరపు ఈ రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అటు పచ్చదనం ఇటు ఉపాధి మరో వైపు బొమ్మల తయారీదారులకు చేయూత
మరో వైపు కృష్ణాజిల్లాలో తెల్లపొనికి/తెల్ల పొలికి చెట్ల పెంపకానికి ఆదేశాలను జారీచేశారు. అచ్చం అంకుడు కలపలానే తేలిగ్గా వంగుతూ, మృదువుగా, తక్కువ బరువుతో ఉండే తెల్లపొనికి కలపతోనే ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మలు వాటి తయారీ కళ అంతర్థానం కాకుండా ఉండేలా బొమ్మల తయారీదారులకు ఆసరాగా ఉండేలా ఎన్టీఆర్ జిల్లాలో తెల్లపొనికి చెట్లను కమ్యూనిటీ క్లస్టర్లలో నాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రెండు జిల్లాల కలెక్టర్లు, ఉపాధి హామీ పనుల అధికారులు ఆయా జిల్లాల్లో బొమ్మల తయారీదారులతో సమావేశాలు నిర్వహించటం ద్వారా ఈ మొక్కలను పెద్ద మొత్తంలో నాటించాలని అందుకోసం ఉపాధి హామీ పనులను మిళితం చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఫలితంగా పచ్చదనం పెంపుతో పాటు ఉపాధి గ్యారెంటీ పనుల్లో తోడ్పాటు అన్నింటికంటే ఎక్కువగా ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు ఆసరాగా నిలిచి ఆ కళలు అంతర్థానం కాకుండా ఉండేలా ఈ ఆదేశాలు ఉపయోగపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Free Gas Cylinder: దీపావళి నుంచి మరో కొత్త పథకం అమలు - ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్