Free Bus Service: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఆ రోజు నుంచే!
Andhrapradesh News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 నుంచే దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Free Bus Service Scheme For Women In AP: ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పలు కీలక హామీలను నెరవేర్చింది. సర్కారు ఏర్పడిన నెల రోజుల్లోనే పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానం వంటి పథకాల అమలు సహా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి వాటినీ అమలు చేసింది. తాజాగా, మహిళలు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme) అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఒకే రోజు రెండు పథకాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ఏర్పాటు సహా మహిళలకు ఫ్రీ బస్ సర్వీసును సైతం ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
అధికారుల అధ్యయనం
అటు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. పథకం అమలు చేస్తే ఆర్టీసీపై పడే ఆర్థిక భారం, పథకం అమలైతే తలెత్తే సమస్యలు, ఆర్థికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అదే రోజు మరో పథకం
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15వ తేదీనే అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలకు రెండు పూటలా కడుపు నింపేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిదశలో 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా.. ఈ నెల 22 వరకూ గడువు ఉంది. ఈ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాలను రూ.20 కోట్లతో ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.
దాతల నుంచి విరాళాలు
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేక వెబ్ సైట్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యాంటీన్లకు దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇప్పుడు కూడా అవే ధరలతో అన్న క్యాంటీన్లలో భోజనం అందించాలని ప్రభుత్వం చెబుతోంది.