Pawan Kalyan: 'చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళిక' - పిఠాపురంలో తొలిసారిగా ఆ ప్రాజెక్ట్, డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Andhrapradesh News: 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే అది సంపదే అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ఎల్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు చెప్పారు.
Deputy CM Pawan Kalyan Panchayat Raj Department Review: చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఆదాయం పెంచుకునేలా మార్గాలు అన్వేషించే లక్ష్యంతో సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (SLRM Project) చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆ శాఖపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ సందర్శించారు. అనంతరం ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రోలులో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్టును రూపొందించారని ఎల్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు.
పిఠాపురం నుంచే తొలిసారిగా..
12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే అది సంపదే అవతుందని.. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో (Pithapuram) తొలిసారిగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ చేపడతున్నామని.. శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నారని చెప్పారు. ప్రజలు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్స్‌ను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. 'పంట కాల్వ కనిపిస్తే కొందరు డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రత ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. పంచభూతాల్లో నీరు ఉంది. నీటిని మనం పూజలకు ఉపయోగిస్తాం. అలాంటి జలాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం పర్యావరణానికి అతి పెద్ద సమస్య ప్లాస్టిక్. ప్లాస్టిక్, చెత్తా చెదారంతో ఇబ్బందులు వస్తున్నాయి. మనం గోవులను పూజిస్తాం. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధాకరం. ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టులో ఈ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ ప్రాజెక్టును మా కార్యాలయంలో.. మా పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టును అమలు చేయగలిగితే పంచాయతీలు, మున్సిపాల్టీలకు ఆదాయం వస్తుంది.' అని పవన్ వివరించారు.
'రూ.2,600 కోట్ల ఆదాయం'
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును అమలు చేస్తే రూరల్ ప్రాంతంలో ఏడాదికి రూ.2,600 కోట్ల ఆదాయం వస్తుందని పవన్ తెలిపారు. 2.45 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. ఇప్పటివరకూ చిన్న చిన్న గ్రామాల్లోనే మాత్రమే అమలు చేసిన ఈ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయాలని సూచించారు. 'గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలను నిర్వీర్యం చేశారు. పంచాయతీలకు నిధులు లేవు. పూర్తిగా ప్రక్షాళన చేపట్టి స్వయం సమృద్ధి ఉండేలా పంచాయతీలను రూపొందించాల్సి ఉంటుంది. భీమవరం డంపింగ్ యార్డ్ విషయంలోనూ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం. చెత్తలో కూడా ఐశ్వర్యం ఉంది అని చెప్పడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం' అని వివరించారు.
'కూరగాయలు, పండ్లు తీసుకురండి'
జనసేన ఎంపీలకు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు సైతం ఈ నిబంధన పాటించాలని సూచించారు. అలాగే, తనను కలిసేందుకు వచ్చిన వారు బొకేలు తీసుకు రావొద్దని.. కూరగాయలు, పండ్లు తీసుకురావాలని సూచించారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి కాదని.. పది మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలా వచ్చిన పండ్లు, కూరగాయలను అనాథ శరణాలయాలకు పంపిస్తానని స్పష్టం చేశారు.