Andhra New Liqour Policy : ఏపీలో మళ్లీ మద్యం దుకాణాల వేలం - ప్రభుత్వం పాలసీ మార్చుకుంటోందా ?
ఏపీలో మద్యం దుకాణాలను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే విధానాన్ని మళ్లీ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారంలో ఈ ప్రక్రియపై ముందడుగు పడవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Andhra New Liqour Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీని మరోసారి మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలు నడపడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని .. అనేక ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకే మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.
మద్యనిషేధం కోసం దుకాణాల్ని తామే నిర్వహిస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీ మధ్య నిషేధం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు సీఎం అయిన తర్వాత లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చేశారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేలా చేశారు. ప్రతీ ఏటా ఇరవై శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం దుకాణలను రెండు సార్లు తగ్గించారు. కానీ మూడో ఏడాది తగ్గించలేదు. పైగా మద్యం మాల్స్ అని.. టూరిజం అని అదనపు దుకాణాలకు అనుమతి ఇచ్చారు. బార్లకు కూడా మూడేళ్లకు మళ్లీ లైసెన్స్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కొత్తగా మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వానివి ఎందుకని పాతపద్దతిలో ప్రైవేటుకు ఇస్తే బెటరని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మద్యం బ్రాండ్లు, నగదు లావాదేవీలపై తీవ్ర విమర్శలు
మద్యం విషయంలో ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టిన తర్వాత ఏపీలో ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా పాపులర్ మద్యం బ్రాండ్లు అమ్మకాలు నిలిపివేశారు. అన్నీ కొత్త బ్రాండ్లే అమ్ముతున్నారు. ఇవన్నీ వైఎస్ఆర్‌సీపీ నేతల బినామీై కంపెనీల్లో తయారు చేయించి అమ్ముతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే మద్యం దుకాణాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి డిజిటల్ చెల్లింపుల సదుపాయం లేదు. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నెలకు రూ. రెండు వేలకోట్లకుపైగా అమ్మకాలు జరిగే ఈ భారీ వ్యవహారంలో నగదు లెక్కే ఉండటంపై విమర్శలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అన్ని సమస్యలకు పరిష్కారంగా మద్యం దుకాణాలను వేలం వేసే ఆలోచన
అదే సమయంలో మద్యం ఆదాయం పెంపు కోసం కూడా ప్రైవేటు మద్యం దుకాణాలు తప్పవని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాల సిబ్బందికి జీతాలతో పాటు దుకాణాల అద్దెలు ఇలా మొత్తం చాలా ఖర్చవుతోంది. అదే సమయంలో ప్రైవేటుకు ఇస్తే లైసెన్స్ ఫీజుల ఆదాయంతో పాటు ఖర్చులూ మిగులుతాయని.. అదే సమయంలో అమ్మకాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. మరో వారంలో దీనిపై ప్రకటన వచ్చే చాన్స్ ఉందంటున్నారు.